తిరుచానూరు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తిరుచానూరు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

కార్మికులపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ కుమారుడు కబ్జాలు చేయడంపై సీపీఐ నేతల మండిపాటు

చంద్రగిరి: భూములను కబ్జా చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్న కానిస్టేబుల్‌ కుమారుడిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. ఆదివారం కూలి పనులు చేసిన భవన నిర్మాణ కార్మికులపై దాడికి పాల్పడడంతో సీపీఐ నేతలు తిరుచానూరు పోలీసు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం పంచాయతీలోని సర్వే నం.246/2లో అవిలాలకు చెందిన నారాయణకు 2.60 ఎకరాలు ఉందన్నారు. ఇందులో 2023లో టీటీడీ విశ్రాంత ఉద్యోగి గుర్రప్ప 60 అంకణాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత కొంత కాలంగా తిరుపతిలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్‌రెడ్డి కుమారుడు మోహన్‌రెడ్డి గుర్రప్పకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గుర్రప్పకు చెందిన స్థలంలో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ పనులు చేస్తుంటే మోహన్‌రెడ్డి అక్కడికి వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపించారు. కొంత మంది యువకులకు మద్యం తాపించి దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పనులు ముగించుకుని వెళ్తున్న చిరంజీవి అనే భవన నిర్మాణ కార్మికుడిపై మోహన్‌రెడ్డి, తన అనుచరులతో కలసి మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో కార్మికులపై దాడులు జరిగాయని, పోలీసులు సైతం మోహన్‌రెడ్డికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. పోలీసుల ఎదుటే స్థల యజమానిపై దాడికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పోలీసు పవర్‌ ఉందనే దురంహకారంతో దాడులు చేస్తున్న మోహన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసు స్టేషన్‌ ఎదుట కార్మికులతో కలసి నినాదాలు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement