చంద్రగిరి: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి గిరిపురానికి చెందిన సంపత్ రాజు, సుగుణలత(52) బెంగళూరు నుంచి కారులో తిరుపతికి వస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి, తొండవాడ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఆపై రోడ్డుకు అటువైపునకు దూసుకెళ్లి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో సుగుణలత అక్కడికక్కడే మృతి చెందగా, సంపత్‌రాజు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడు సంపత్‌రాజుకు ప్రథమ చికిత్సను అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాద వివరాలను తెలుసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, సుగుణలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.


