● రాయితీ విత్తన కాయల కోసం ఎదురుచూపులు ● పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వని దుస్థితి ● విత్తన పంపిణీలో కాలయాపన
తిరుపతి అర్బన్: రైతులకు ప్రతి సీజన్‌లో 50 శాతం రాయితీలో ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను ఇస్తుంది. అయితే గత రబీ సీజన్‌లో చంద్రబాబు సర్కార్ వేరుశనగ విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నాయని రాయితీలో ఇవ్వలేమంటూ ఎగనామం పెట్టింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇస్తారా? లేదా తెలియడం లేదు. ఇప్పటి వరకు రైతులకు విత్తనాలు వస్తాయనే సమాచారాన్ని ఇవ్వకపోవడంతో వారంతా దిక్కులు చూస్తున్నారు. సాధారణంగా 30 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుంది. ప్రభుత్వం 50 శాతం రాయితీలో ఇస్తే రూ.1,250కే వస్తుంది. ఎకరం సాగుకు 30 కిలోల బస్తాలు 4 కావాల్సి ఉంది. బస్తాపై రూ.1,250 చొప్పున నాలుగు బస్తాలకు రైతులకు రూ.5 వేలు ఆదా ఆవుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతుకు అయితే రూ.25 వేలు ఆదా అవుతుంది. గత రబీ సీజన్‌లో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపలేదు. ఈ సీజన్‌లోనైనా సబ్సిడీ విత్తన కాయలు ఇస్తారో? లేదోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఖరీఫ్ సీజన్‌కు పచ్చిరొట్ట విత్తనాలు ప్రశ్నార్థకం
పచ్చరొట్ట విత్తనాలు(జీలగలు, జనుములు, పిల్లిపెసర)50 శాతం నుంచి 60 శాతం రాయితీలో ఇస్తుంటారు. అయితే రబీ సీజన్‌లో నామమాత్రంగా అందించారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు పచ్చిరొట్ట విత్తనాలు ఇస్తామని రైతులకు భరోసా కల్పించకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.
జూన్ మొదటి వారం నుంచే
పంట సాగు
సాధారణంగా మేలో భూములు దుక్కి చేసుకున్న రైతులు జూన్ మొదటి వారం నుంచి వేరుశనగ పంట సాగు చేస్తుంటారు. అయితే పచ్చిరొట్ట విత్తనాలు మే మొదటి వారంలో ఇచ్చి ఉంటే రైతులు వాటిని చల్లుకుని ఉండేవారు. అయితే మే నెల నాలుగో వారంలో విత్తనాలు వస్తాయని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత విత్తనాలు జూన్ మొదటి వారంలో రైతులకు పంపిణీ చేస్తారు. వాటిని రైతులు చల్లుకుంటే జూన్ నాలుగో వారం లేదా జూలై మొదటి వారంలో దుక్కి చేయాల్సి ఉంది. తర్వాత జూలై మొదటి వారం తర్వాత వేరుశనగ పంట సాగుచేయాల్సి ఉంటుంది. అంటే ఒక నెల ఆలస్యంగా సాగుచేయడం ద్వారా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒకప్పుడు వేరుశనగ ప్రధాన పంట
ఒకప్పుడు వేరుశనగ పంట సాగుకు తిరుపతి జిల్లా పెట్టిన పేరుగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాలకు పైగా పంటను సాగు చేసేవారు. గత ప్రభుత్వంలో ప్రతి మండలంలోనూ రబీ సీజన్‌తోపాటు ఖరీఫ్ సీజన్‌లోనూ వేరుశనగ సాగుచేసేవారు. రాయితీ విత్తనాలతోపాటు రైతుకు అవసరం అయిన పనిముట్లు, పురుగుమందులు సమకూర్చడంతోపాటు రైతులను ప్రోత్సహించేవారు. చంద్రబాబు సర్కార్‌లో రాయితీ విత్తనాలు ఇవ్వడం మానుకున్నారు. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. గత రబీ సీజన్‌లో వేరుశనగ విత్తనాల రేట్లు పెరిగాయని, సబ్సిడీ విత్తనాలను రైతులకు ఇవ్వడం మానుకున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వేరుశనగ విత్తనాలు ఇస్తామని, ప్రభుత్వం నుంచి అధికారుల ద్వారా రైతులకు ఇప్పటి వరకు భరోసా కల్పించలేదు. దీంతో రైతులు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తమ పొలాన్ని దుక్కి చేసుకుందామా? వద్దా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం రబీలో సబ్సిడీ విత్తన కాయల విషయంలో చేతులెత్తేసింది. ఇక మిగిలింది ఖరీఫ్ సాగే. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంట వేరుశనగే. జూన్ మొదటి వారం నుంచి సాగుకు అనుకూలమైన సమయం. గత రెండు రోజుల నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవడంతో కర్షకులు సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ వేరుశనగ విత్తన కాయలు ఈ సీజన్‌లోనైనా ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.


