తిరుపతి రూరల్: మండలంలోని దామినేడు వద్ద లిడ్‌క్యాప్ సంస్థకు చెందిన భూములను చదును చేస్తుండగా దళిత సంఘాల నేతలు శనివారం అడ్డుకున్నారు. దళిత సంఘం నేత సుధాకర్‌బాబు మాట్లాడుతూ దామినేడు లెక్క దాఖలా సర్వే నంబర్ 71/ఏ 2.80 సెంట్లు, 72/3ఎ 1.74 సెంట్లు, 72/2ఏ 1.11 సెంట్లు, 101/3ఏ 0.83 సెంట్లు, 101/2 ఏ 2.70 సెంట్లు మొత్తం 9.23 ఎకరాలు ఉండగా అందులో 6 ఎకరాల భూమిని 1973 – 74లో అప్పటి ప్రభుత్వం చర్మ కారులకు లిడ్ క్యాప్ సంస్థ పేరున కేటాయించిందన్నారు. మాదిగల అభ్యున్నతికి కోసం కేటాయించిన భూమిని తిరుపతికి చెందిన గిరిధర్, రామ్మూర్తి, గోవింద్ చదును చేస్తుండగా అడ్డుకున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణ దారులకు లిడ్ క్యాప్ పరిరక్షణ కమిటీ సభ్యులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు భూమిపై సమగ్ర సమాచారం అందేంత వరకు ఒక వారం రోజుల పాటు ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించకూడదని ఇరువర్గాల వారికి సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్ పి.సుబ్బయ్య మాట్లాడుతూ చర్మకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను రక్షించాలని పోలీసులను కోరారు. ఇప్పటికే ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించామన్నారు. అడ్డుకున్న వారిలో లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు వాలముని, బి.కృష్ణ, కే.కాటయ్య, డి.రాంబాబులు ఉన్నారు.


