వసంతోత్సవం.. పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

వసంతోత్సవం.. పరిసమాప్తం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన వసంతోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులు, సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి, రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి, ఆస్థానం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.45 నుంచి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం చేశారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు, వట్టివేరు, రోజా, మల్లె, సంపంగి, గులాబి, దవణం, తులసి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కాగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ రమేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధన శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement