బుడిబడి నడకలేవీ..? | - | Sakshi
Sakshi News home page

బుడిబడి నడకలేవీ..?

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

ముందుకురాని కార్పొరేట్‌ స్కూళ్లు, ఏ గ్రేడ్‌ పాఠశాలలు బీ, సీ గ్రేడ్‌ స్కూళ్లలో చేరడానికి ఆసక్తి చూపని విద్యార్థులు

అద్భుతమైన పథకం.. మహాద్భుతమైన నిబంధనలు.. ఇంకేం పేద విద్యార్థులకు ఇబ్బందే ఉండదు. అక్షరాలు కదం తొక్కుతాయి. పేద పిల్లలందరూ ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల తలుపులు తడతారు. పేదలందరికీ కార్పొరేట్‌ విద్య అందుతుంది. పేదింట అక్షరాల పూదోటలు విలసిల్లుతాయనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ప్రభుత్వం మారింది.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పేద విద్యార్థులు కార్పొరేట్‌ గడప తొక్కలేక మగ్గిపోతున్నారు. ఇదీ ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యా పథకం పరిస్థితి.

సరైన అవగాహన కల్పించడంలో విఫలం

విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ ప్రాంతంలోనే ఉండే మంచి స్కూలును ఎంపిక చేసుకుంటే, ఉచిత విద్య పథకంలో అవకాశం కల్పిస్తామనే అవగాహన కల్పించలేదని విమర్శలున్నాయి. అలాగే కార్పొరేట్‌ పాఠశాలతోపాటు గుర్తింపు ఉన్న స్కూళ్లను ముందే సంప్రదించి...నామ్‌ అకడమిక్‌ పేరుతో రూ.30వేలు చెల్లించడం కుదరదని చెప్పడంలోను విద్యాశాఖ వెనుకబడి ఉందని చర్చసాగుతోంది. దీంతోనే అడ్మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రైవేటు స్కూళ్లను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది.

తిరుపతి అర్బన్‌: పేద విద్యార్థులకు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూల్స్‌లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థి తమ నివాసానికి సమీపంలోని ప్రైవేటు స్కూల్‌లో చేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ప్రతి కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25శాతం అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. ఆ విధానాన్ని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేశారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుందనే విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ఏ గ్రేడ్‌లోనే కార్పొరేట్‌ స్కూళ్లలోనే కాకుండా బీ,సీ గ్రేడ్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలను విద్యాశాఖాధికారులు చేర్పిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

కార్పొరేట్‌ స్కూళ్లలో నాన్‌ అకడమిక్‌ ఫీజు రూ.30వేలు డిమాండ్‌

ఉచిత విద్య పథకానికి సంబంధించి కార్పొరేట్‌ స్కూళ్లను ఏ గ్రేడ్‌గా విభజించారు. అలాంటి స్కూళ్లలో పిల్లలను చేర్చుకుంటే విద్యాశాఖ ఒక విద్యా ర్థికి రూ.13 వేలు చొప్పన స్కూల్‌కు చెల్లించాలి (తల్లికి వందనంకు ఇచ్చే డబ్బులు), అలాగే మధ్యతరగతి ప్రైవేటు స్కూళ్లను బీ గ్రేడ్‌గా విభజన చేశారు. అలాంటి స్కూల్‌కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.11,500 చెల్లించాలి. మిగిలిన 1500 విద్యార్థి తల్లిఖాతాలో జమ చేస్తారు(తల్లికి వందనం రూ.13 వేలు నగదు విభజన), చిన్న ప్రైవేటు స్కూళ్లను సీ గ్రేడ్‌గా విభజన చేశారు. అలాంటి స్కూల్‌కు విద్యాశాఖ వారు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు చెల్లిస్తారు. మిగిలిన రూ.3 వేలు నగదు విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు (ఏ గ్రేడ్‌)ఉచిత విద్య స్కీమ్‌ ద్వారా పిల్లలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. నాన్‌ అకడమిక్‌ పేరుతో అదనంగా రూ.30 వేలు ఒక్కో విద్యార్థి చెల్లించాలని మెలిక పెట్టేస్తున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. ఇక బీ గ్రేడ్‌లో భాగంగా మీడియం స్కూళ్ల విషయానికి వస్తే ఒకటో తరగతిలో అడ్మిషన్లు తక్కువ శాతం ఉన్నవారు మాత్రమే పేద పిల్లలను చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సీ గ్రేడ్‌లో భాగంగా చిన్న ప్రైవేటు స్కూళ్లు, ప్రధానంగా మండల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో కొత్తగా పెడుతున్న చిన్న పాఠశాలల వారు మాత్రమే తమకు సరైన అడ్మిషన్లు లేకపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ సైతం అదే దారిలో అడుగులు వేస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అడ్మిషన్లు కోసం ఎదురుచూస్తున్న ప్రైవేటు స్కూళ్లలోనే ఉచిత విద్య పథకం ద్వారా చేర్చుతున్నారనే విమర్శలున్నాయి.

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు తగ్గుతున్న ఆదరణ

నాలుగు విడతల్లో 25 శాతం విద్యార్థుల భర్తీ

ఉచిత విద్య పథకంలో భాగంగా జూన్‌ 12 లోపు నాలుగు విడతల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను విద్యాశాఖ వారు ప్రైవేటు స్కూళ్లలో చేర్చించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 523 మంది పేద విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే అందులో 106 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్‌ తమకు నచ్చకపోవడంతో అడ్మిషన్లు తీసుకోలేదు. రెండో విడతలో 261 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 16 లోపు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆడ్మిషన్లు తీసుకోలేదు. మూడో విడత ప్రక్రియ ఈ నెల 17 నుంచి 31వ తేదీ లోపు, నాలుగో విడత జూన్‌ 1 నుంచి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement