ఏపీఈసెట్ ఫలితాల్లో
తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ డిప్లొమో పూరైన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెల 23న నిర్వహించిన ఏపీ ఈసెట్–2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తిరుపతి జిల్లాలో 92.62 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 1,522 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,463 మంది ఏపీఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,355 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మళ్లీ బాలికలదే పైచేయి..
ఉన్నత విద్యామండలి విడుదల చేసిన ఏపీఈసెట్–2026 ఫలితాల్లో జిల్లాలో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది ఉత్తమ మార్కులు సాధించారు. ఏపీఈసెట్‌కు 980 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 902 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 483 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 453మంది ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్ర స్థాయిలో మెరిసిన జిల్లా విద్యార్థులు
జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 20 విభాగాల్లో జరిగిన ఏపీ ఈసెట్ పరీక్షలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో తిరుపతి శ్రీపురంకాలనీకి చెందిన సి వెంకట నిఖిత రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. ఆమె తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ విభాగంలో డిప్లొమో పూర్తి చేసింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం, దామల చెరువుకు చెందిన విద్యార్థి సీ పునీత్ కుమార్ బీఎస్సీ(గణితం) స్ట్రీమ్‌లో ఈసెట్ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. ఆయన చిత్తూరు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఏపీఈసెట్ పరీక్షలో ర్యాంకు సాధించారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పలు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలవిద్యార్థులు కుసుమ 9వ ర్యాంక్, ఎస్ గౌరి 19, భువనేశ్వరి 24, రమ్యకృష్ణ 30, కే నిఖిత 52, నందిని 47, శైలజ 64, శిరీష 74 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ వై ద్వారకనాథ్‌రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు.


