ఏపీ పీజీసెట్‌ –2026 ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీజీసెట్‌ –2026 ప్రారంభం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్‌–2026 శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం కోడ్‌ను ఎస్వీయూ వీసీ, పీజీసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ నర్సింగరావు వర్సిటీలోని పీజీ సెట్‌ కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ పీజీసెట్‌ – 2026లో భాగంగా తొలి రోజు శుక్రవారం మధ్యాహ్నం 4 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 397 మంది దరఖాస్తు చేసుకోగా 319 మంది హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పద్మావతి, కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ దేవప్రసాద్‌రాజు తెలిపారు. తొలిరోజు 80శాతం హాజరు నమోదైందని పరీక్ష ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్నారు. ఈనెల 11వ తేదీ వరకు పీజీ సెట్‌ కొనసాగుతుందని తెలిపారు.

అక్రమంగా చెరువు మట్టి తరలింపు

ఏర్పేడు: మండలంలోని కోబాక పంచాయతీ కుప్పయ్యకండ్రిగ చెరువులో శుక్రవారం సమీపంలోని ప్రైవేటు వెంచర్‌కు అక్రమంగా మట్టి తరలిస్తుండడంతో పోలీసులు ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో మట్టి రాత్రింబవళ్లు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వి తరలిస్తు న్నారు. చెరువును ఇప్పటికే పెద్ద పెద్ద గోతులుతో తవ్వేసి మట్టిని ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తూ కొందరు అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement