స్వర్ణరథ రంగ వైభవం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణరథ రంగ వైభవం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

● స్వర్ణరథంపై మెరిసిన కల్యాణ వెంకన్న ● వేడుకగా వసంతోత్సవాలు

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు స్వర్ణరథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్‌, సూపరింటెండెంట్లు రమేష్‌ బాబు, రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధనశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement