తిరుపతి అర్బన్: కేంద్రం చేపట్టిన అన్ని అభివృద్ధి పనుల్లో పురోగతి చూపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన కమిటీ చైర్మన్ మాగంటి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తిరుపతికి విచ్చేసిన కమిటీ బృందం శుక్రవారం తాజ్ హోటల్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన అమృత్, అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్)2.0, పీఎం స్వానిధి, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఎన్‌యూడీఎం, పీఎం ఈ–బస్సు సేవా తదితర కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తిరుపతిలో మెరుగైన సౌకర్యాలకల్పన, పట్టణ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మరోవైపు మెప్మా ఆధ్వర్యంలో మూడు విడతల్లో 3,752 మంది వీధి వ్యాపారులకు రూ.15.69 కోట్లు మంజూరుకు సంబంధించి పరిస్థితి ఏమిటని ఆరా తీశారు. పార్లమెంటరీ అధ్యయన కమిటీ సభ్యులు, అధికారులు సురేష్‌కుమార్, కరుణ, అనీల్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్, టీటీడీ ఈఓ రవిచంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు లారీ దగ్ధం
–తప్పిన పెను ప్రమాదం
రేణిగుంట: కడప చైన్నె రహదారి రేణిగుంట సమీపంలోని రామకృష్ణాపురం సర్కిల్‌లో శుక్రవారం రాత్రి చైన్నె నుంచి రైల్వే కోడూరుకు వెళుతున్న లారీ మంటలకు ఆహుతైంది. స్థానికుల కథనం మేరకు.. రైల్వే కోడూరు చెందిన లారీ డ్రైవర్ ఖాజా హుసేన్ లారీలో రాయి లోడ్ చేసుకుని చైన్నెకి వెళ్లి అన్‌లోడ్ చేసి ఖాళీ లారీతో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు టైర్లు వద్ద నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ లారీని పక్కకు ఆపి సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట అర్బన్ ఎస్‌ఐ ధర్మారెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే పూర్తిగా లారీ కాలిపోయింది.
చోరీల కేసులో నిందితుడి అరెస్టు
తిరుపతి క్రైం: తాళాలు వేసి ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని తిరుపతి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నెహ్రూ నగర్‌కు చెందిన ఉల్కేష్ (27) విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాలను గమనిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూవచ్చాడు. తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా జరిగిన చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు 2024లో తిరుపతి నగర పరిధిలో మొత్తం ఆరు చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.18.50 లక్షల నగదు, 126.135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు గొలుసులు, ఉంగరాలు, చైన్లు, లక్ష్మీ డాలర్ చైన్, చెవిపోగులు తదితర ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. కేసు ఛేదించిన పనిచేసిన సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


