రూటు మార్చిన ఇసుకాసురులు | - | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన ఇసుకాసురులు

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

● పొట్టు బస్తాల మాటున ఇసుక అక్రమ రవాణా

నాయుడుపేట టౌన్‌: స్వర్ణముఖి నది నుంచి ఇసుక పొట్టు మాటున తరలిపోతోంది. తరచూ తనిఖీలతో ఇసుకాసురులు రూటు మార్చి పొట్టు బస్తాల మాటున తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో డంపింగ్‌ చేసి, అధికారులు, పోలీసుల కళ్లు గప్పి, పొట్టు మాటున లారీల్లో తమిళనాడుకు తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంగమాంబపురం సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ స్టీల్‌ పరిశ్రమ వెనుకన ఉన్న అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలించి, డంపింగ్‌ చేసుకుని అర్ధరాత్రి సమయాల్లో లారీల్లో పొట్టుబస్తాల మాటున నిరంతరంగా తరలిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, పోలీసులకు తెలిసినా పట్టించుకోక పోవడం ఆంతర్యం ఏమిటోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వెంగమాంబపురం రహదారి పక్కనే ఉన్న స్టీల్‌ పరిశ్రమ వెనుక అటవీ ప్రాంతంలో ట్రాక్టర్లతో అక్రమంగా డంపింగ్‌ చేసిన ఇసుక నిల్వలను లారీలలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే లారీ డ్రైవర్‌, క్లీనర్‌లు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి ఇసుక డంపింగ్‌ యార్డు వద్ద పొట్టుబస్తాలతో ఆపి ఉన్న లారీని పోలీసులు సీజ్‌ చేసి, తీసుకువెళ్లక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ సీజ్‌పై ఇంకా మంతనాలు జరుగుతున్నాయా? లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోవడం లేదా? అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణా దందా సాగుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement