అక్రమాలకు అధికారిక అనుమతులు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అధికారిక అనుమతులు

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

● ఇసుక, గ్రావెల్‌, మట్టి తరలింపునక ఇష్టారాజ్యంగా అనుమతులు ● ఒక్కో అనుమతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మామూళ్లు ● ఓ మంత్రికి ప్రతి ట్రిప్‌నకు రూ.వెయ్యి మామూలు ● రోజూ వందల ట్రిప్పుల అక్రమ రవాణా

● ఇసుక, గ్రావెల్‌, మట్టి తరలింపునక ఇష్టారాజ్యంగా అనుమతులు ● ఒక్కో అనుమతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మామూళ్లు ● ఓ మంత్రికి ప్రతి ట్రిప్‌నకు రూ.వెయ్యి మామూలు ● రోజూ వందల ట్రిప్పుల అక్రమ రవాణా

అడ్డుకోవడం మరిచిన

అధికారులు

ప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్‌ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనుమతులు ఇలా..

తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్‌ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్‌ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement