ఇష్టారాజ్యంగా ఇంటర్ అడ్మిషన్లు
●
కమీషన్ల ఆశ చూపి టీచర్లకు గాలం
కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కమీషన్ల ఎర వేసి గాలం వేస్తున్నాయి. పాఠశాలలో పది పాసైన విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు రెఫర్ చేయాలని ఒక్కో అడ్మిషన్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉపాధ్యాయులు అదే ప్రవృత్తిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మభ్యమాటలు చెప్పి కమీషన్ ఇచ్చే కళాశాలలో ప్రవేశాల కల్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుపతి సిటీ: పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు నిబంధనలు తుంగలో తొక్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు తెరతీసి తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏకంగా తరగతులను ప్రారంభించాయి. ఎలాగైనా తమ కళాశాలలో ప్రవేశాలను పెంచుకోవాలనే ప్రధాన లక్ష్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేవలం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో మాత్రమే అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రవేశాలు ముగింపు దశకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు
పదో తరగతి ఉత్తీర్ణులైన తమ పిల్లలను పట్టణాల్లో పేరొందిన కళాశాలలో ఇంటర్ చదివించాలని తల్లిదండ్రుల పరితపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు మీ పిల్లల ఫీజులో రాయితీ ఇస్తామని, నీట్, జేఈఈ కోచింగ్ ఇస్తూ ఇంటర్మీడిట్ టాప్ మార్కులతో పాస్ చేస్తామని మభ్యపెడుతున్నాయి. సాధారణ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థికి రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో పాటు హాస్టల్ ఫీజు నెలకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. బైపీసీ ప్లస్ నీట్ కోచింగ్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలో సగం ఫీజు కట్టాలని, మిగిలిన ఫీజు రెండు నెలలో చెల్లించాలని తల్లిదండ్రులను మభ్యపెడుతూ కోట్లు దోచుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా ముట్టజెబుతున్నారు.
అనుమతులు లేని కళాశాలలతో జాగ్రత్త సుమా!
తిరుపతి జిల్లాలో సుమారు 109 ప్రైవేటు కళాశాలలు ఉండగా అందులో కేవలం 75 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు సమాచారం. పలు కళాశాలలు అనుమతి ఒక చోట కళాశాలలు బ్రాంచీల పేరుతో మరో చోట నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కళాశాలలు తిరుపతి జిల్లాలో 33వరకు ఉన్నట్లు సమాచారం. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు కళాశాలల నడుపుతున్న అధికారులు చోద్యం చూస్తుండటం గమనార్హం.
జిల్లా సమాచారం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 72
కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు 105
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు అనుమతి ఉన్న సీట్ల సంఖ్య సుమారు 25 వేలు
పూర్తి స్థాయి అనుమతులు ఉన్న ప్రైవేటు కళాశాలలు 63
అనుమతి ఒక చోట కళాశాల మరోచోట నడుపుతున్న కళాశాలలు 33
అపార్ట్‌మెంట్లు, నివాస గృహాల్లో నడుస్తున్న కళాశాలలు 54
ల్యాబ్‌లు, క్రీడామైదానాలు లేని కళాశాలలు సుమారు 80కి పైన
నిబంధనలు పాటించకుంటే చర్యలు
ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు ఇంటర్ అడ్మిషన్లు చేపట్టినా, అధిక ఫీజు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు పిల్లలను ఇంటర్‌లో చేర్పించే క్రమంలో కళాశాల ఎంపికపై జాగ్రత్త వహించాలి. – జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి


