వైభవం.. వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. వసంతోత్సవం

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

● కల్యాణ వెంకన్న ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభం ● నేడు కనులపండువగా స్వర్ణ రథోత్సవం

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేయగా, గోవింద నామస్మరణలతో ఆలయ వీధులు మారుమోగాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, ఊంజల్‌ సేవను జరిపారు. వసంతోత్సవాలను పురస్కరించుకుని నిత్య కల్యాణోత్సవం, తిరుప్పావడ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ రమేశ్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధనశేఖర్‌, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement