స్విమ్స్‌పై బోర్డు సభ్యుడి పెత్తనం | - | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌పై బోర్డు సభ్యుడి పెత్తనం

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

టార్గెట్‌ చేసి లొంగ తీసుకోవడం.. లేదంటే బ్లాక్‌ మెయిల్‌ టీటీడీ చైర్మన్‌ చెప్పినా ఫైల్‌ ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: టీటీడీ ఆస్పత్రులు ఓ బోర్డు సభ్యుడుకి ఆదాయ వనరుగా మారింది. మెడికల్‌ షాపులు, ఇతర టెండర్లలో మితిమీరిన జోక్యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఆ వ్యక్తి కారణంగా వివాదస్పదమవుతున్నాయి. ఆ వ్యక్తి మితిమీరిన జోక్యంతో స్విమ్స్‌, శ్రీ పద్మావతి ఆస్పత్రి రోగుల పాలిట శాపంగా మారాయి. మామూళ్ల పేరుతో టెండర్‌ దారులను లొంగదీసుకోవడం, మాట వినకపోతే వివిధ ఆరోపణలతో అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకి సవాల్‌గా మారింది. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌, శ్రీ పద్మావతి, బర్డ్‌, చిన్నపిల్లల ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులు సరఫరా, శానిటేషన్‌ నిర్వహణ, ఆహారం, ఇతర కొనుగోళ్లు టెండర్ల ద్వారా నిర్వహిస్తారు. ఈ క్రమంలో టీటీడీలోని ఓ బోర్డ్‌ సభ్యుడు టెండరుదారులను టార్గెట్‌ చేశారు. దాదాపు ఏడాదిన్నర పైగా ఆయన ఈ హాస్పిటల్‌ చుట్టూనే తిరుగుతూ తన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తాను అడిగింది ఇవ్వాలని, చెప్పింది చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. అడిగింది ఇవ్వని పక్షంలో వారిపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేయడం, అక్రమాలు జరుగుతున్నాయని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఇదే విషయాలతో టీటీడీ పెద్దలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఆయన మాఫియాను నడిపిస్తున్నారు.

ఇప్పుడు స్విమ్స్‌ వంతు

అత్యాధునిక వైద్యాన్ని అందిస్తామని చెబుతున్న టీటీడీ పెద్దలు ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్విమ్స్‌లో మూడు మెడికల్‌ షాపులకు గాను కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మెడికల్‌ షాపు యజమానిని లొంగదీసుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాను అన్నింటిలోనూ పక్కాగా ఉండానని, మీరు అడిగింది ఇస్తే రోగులకు సరసమైన ధరలకు మందులు అందించలేమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఎన్నాళ్లు నిమ్మకుండి పోయారు. ఆ మెడికల్‌ షాప్‌నకు టెండర్‌ అయిపోవడంతో కొనసాగింపు లేకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. రూ.2 కోట్లు ఇస్తే రెండేళ్లు కొనసాగించేలా ఆర్డర్‌ తీయిస్తానని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ యజమాని ససేమిరా అనడంతో అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. టీటీడీకి ఈ మెడికల్‌ షాపు ద్వారానే దాదాపు రూ.31 లక్షలు ఆదాయం సమకూరుతోంది. టీటీడీ ప్రస్తుతం టెండర్‌ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఆయననే కొనసాగించేందుకు బోర్డు తీర్మానం చేసింది. 20 రోజుల క్రితం ఆయన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చైర్మన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే స్విమ్స్‌ డైరెక్టర్‌ సైతం ఆ బోర్డు సభ్యుడి గుప్పెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌ చెప్పిన ఉత్తర్వులు ఇవ్వకుండా డైరెక్టర్‌ తెలివిగా వ్యవహరిస్తున్నట్లు స్విమ్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్‌లోనూ ఈ మెడికల్‌ షాప్‌ వ్యవహారాన్ని ఆ బోర్డు సభ్యుడు ప్రస్తావించగా చైర్మన్‌ గట్టిగా బదులిస్తూ ఏమి చేయాలో తనకు తెలుసు, కొనసాగించాలని డైరెక్టర్‌కి చెప్పాము కదా అంటూ గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.

మెడికల్‌ షాపులు, టెండర్లలో మితిమీరిన జోక్యం

టీటీడీకి భారీ నష్టం

పద్మావతి ఆస్పత్రిలో మెడికల్‌ షాపు అర్ధంతరంగా తొలగించడంతో టీటీడీకి భారీగా నష్టం చేకూరింది. రోగుల మందుల కష్టాలు పక్కన పెడితే నెలకు రూ. 21 లక్షలు టీటీడీ ఖజానాకు సమకూరేది. బోర్డు సభ్యుడు అడిగింది ఇవ్వకపోవడంతో నిర్ధాక్షణ్యంగా తొలగించేందుకు కుట్రపన్నారు. గతంలో ఆ బోర్డు సభ్యుడు మాటలను విశ్వసించిన చైర్మన్‌ ముందు వెనుక చూసుకోకుండా తల ఊపేశారు. మెడికల్‌ షాప్‌ టార్గెట్‌ వెనుక బోర్డు సభ్యుడు వ్యక్తిగత ఎజెండా ఉందని ఆయన గుర్తించలేకపోయారు. తద్వారా టీటీడీ ఆదాయానికి గండి పడడంతో పాటు రోగులు మందుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. స్విమ్స్‌లోను ఇదే తరహా ఎత్తులు వేయడంతో బోర్డు సభ్యుడు వ్యవహారంపై చైర్మన్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న మెడికల్‌ షాపునే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. కొనసాగింపు ఆర్డర్‌ ఇవ్వాల్సిన స్విమ్స్‌, వీసీని ఆయన గుప్పెట్లో పెట్టుకుని ఉత్తర్వులు జారీ అవ్వకుండా అడ్డుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చైర్మన్‌ ఆదేశాలని డైరెక్టర్‌ పెడచెవిన పెట్టినట్లు స్విమ్స్‌లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. చైర్మన్‌ మాట నెగ్గుతుందా... లేదా బోర్డు సభ్యుడి టార్గెట్‌ ఫలిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

మందుల షాపు రానివ్వకుండా అడ్డు

శ్రీపద్మావతి ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి పైగా రోగులు వస్తుంటారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో మెడికల్‌ షాపును నా అనుకున్న వాళ్లకు రాకపోవడంతో అడుగడుగునా ఆ బోర్డు సభ్యుడు అడ్డుపడుతున్నాడు. గతంలో ఉన్న మెడికల్‌ షాపును వివిధ ఆరోపణలతో ఆ యజమానికి వైఎస్సార్‌ సీపీ ముద్ర వేసి సాగనంపడంలో ఆయన విజయం సాధించారు. ఈ క్రమంలో సుమారు ఎనిమిది నెలల పాటు పద్మావతి ఆస్పత్రిలో మెడికల్‌ షాపు లేకుండా పోయింది. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నా మాత్రం మెడికల్‌ షాపును ఏర్పాటు చేయలేక టీటీడీ చేతులెత్తేసింది. తాను సిఫార్సు చేసిన ఏజెన్సీకి అర్హత లేకపోవడంతోనే మరో మెడికల్‌ షాపును రానివ్వకుండా ఆయన అడ్డుపడుతున్నారు. దీంతో రోగుల మందుల కష్టాలు తీర్చలేని దౌర్భాగ్య స్థితిలో టీటీడీ విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement