కల్లిపూడిలో ట్రాన్స్‌ఫార్మర్
ఎమ్మెల్యే సతీమణి తొట్టంబేడు మండలాన్ని దత్తత తీసుకోవడంతో తమ గ్రామం రూపురేఖలు మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు. అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని భావించారు. తీరా చూస్తే గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. కనీసం అవసరమైన విద్యుత్ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామాన్ని బొజ్జల రిషితమ్మ దత్తత తీసుకున్నారు. తమ గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కరించకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరని, పేరుకే దత్తత గ్రామం తప్పితే సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని మండిపడుతున్నారు. – తొట్టంబేడు


