తిరుపతి అన్నమయ్యసర్కిల్: బాలాజీ రైల్వేడివిజన్ ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అన్నారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తిరుపతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు రైల్వే డివిజన్‌ను తిరుపతికి తరలించి పరిపాలన కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. తిరుపతి జిల్లా గుంతకల్లు, గుంటూరు, బెజవాడ, చైన్నె, డివిజన్లు నాలుగు రైల్వే డివిజన్లతో అనుసంధానం కలిగి ఉండడంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వి చౌదరి, శ్రీధర్ బాబు, వైఎస్ బాబు, హేమంత్ కుమార్, చిట్టిబాబు, నీలేష్ కుమార్, నీలాద్రి, రమేష్,తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఆస్పత్రిగా
స్విమ్స్ అభివృద్ధి
తిరుపతి తుడా: రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా స్విమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం స్విమ్స్ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ తదితర ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు సదాశివరావు, పనబాకలక్ష్మీ, జారకీదేవి, భాను ప్రకాష్‌రెడ్డి, వైధ్యాధికారులు పాల్గొన్నారు.


