ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ! | - | Sakshi
Sakshi News home page

ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ!

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

● నెల రోజులుగా ఎండకు ఎండుతున్న ట్రైసైకిళ్లు ● మోటార్‌ సైకిళ్లకు దరఖాస్తు చేసుకుంటే ట్రైసైకిళ్లా?

తిరుపతి అర్బన్‌: ‘మూడు చక్రాల మోటార్‌ వాహనం ఇస్తేనే తీసుకుంటాం. ట్రై సైకిళ్లు మా కొద్దు బాబూ’ అని దివ్యాంగులు భీష్మించారు. దీంతో నెల రోజులుగా ట్రైసైకిళ్లు కలెక్టరేట్‌ వద్ద ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. తమ అవసరాల నిమిత్తం లోకల్‌లో రవాణా చేయడానికి సౌకర్యంగా ఉంటుందని పలువురు దివ్యాంగులు మోటార్‌ వాహనాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. సాధారణ సమయంలోనే కాకుండా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లోనూ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. వినోద్‌కు దాదాపుగా 300 మంది దివ్యాంగులు దరఖాస్తులు అందజేశారు. అయితే మూడు చక్రాల మోటార్‌ సైకిల్‌ ఒక్కొక్కటి రూ.1.20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని, మూడు చక్రాల సైకిల్‌ అయితే రూ.12 వేలు వస్తుందని, ట్రైసైకిళ్లను నెల రోజుల కిందట తెప్పించారు. ఆ మేరకు దరఖాస్తులు చేసుకున్నవారికి వచ్చి మూడు చక్రాల సైకిల్‌ను తీసుకుపోవాలని ఆహ్వానిస్తున్నారు. అయితే వాళ్లు మాత్రం తాము దరఖాస్తులు చేసుకున్నది మూడు చక్రాల మోటార్‌ వాహనం కోసమని, ట్రై సైకిల్‌ తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ట్రైసైకిళ్లు తుప్పు పడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement