తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్‌సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు.
తప్పని ఏనుగుల బెడద
– కొండ్రెడ్డికండ్రిగ చెరువులో గజరాజుల హల్‌చల్
చంద్రగిరి: అటవీ సమీప గ్రామాల్లో ఏనుగుల బెడద తగ్గడం లేదు. రెండు నెలలుగా ఏనుగుల దాడులతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మండలంలోని కొండ్రెడ్డికండ్రిగ చెరువులోకి గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. చెరువులో సుమారు గంట పాటు తిష్టవేసిన ఏనుగులు అక్కడ నుంచి పంట పొలాలపై దాడులకు పూనుకున్నట్లు రైతులు వాపోతున్నారు. పక్వానికి వచ్చిన మమాడి కాయలను నాశనం చేస్తున్నాయని, వరి, జొన్న, అరటి తోటలను తొక్కేయడంతోపాటు వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తున్నట్లు వాపోతున్నారు.


