ఈ ఏడాదీ గడ్డుకాలమే?
●
సాధారణంగా రైతు ఏం కోరుకుంటాడు..అందరికంటే తనకు పంట దిగుబడులు బాగుండాలని..మంచి లాభాలు రావాలని ఆశిస్తాడు. అయితే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు తయారైంది మామిడి రైతు పరిస్థితి. గత ఏడాది కాయలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలుకాగా.. ఈ సీజన్‌లో కూడా అదే స్థితి నెలకొనే సూచనలు దాపురించాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మన మామిడిపై పడింది. యుద్ధం కారణంగా జిల్లాలోని మామిడి గుజ్జు ఎగుమతులు ఆగిపోయి, నిల్వలు పేరుకుపోయాయి. మామిడి సీజన్ ప్రారంభమైనా ఇంకా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
48,360 మెట్రిక్ టన్నుల
పల్ప్ నిల్వలు
జిల్లాలో 8 మామిడి ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి తోతాపురి కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఫ్యాక్టరీల వద్ద 48,360 మెట్రిక్ టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. వాటిని విక్రయిస్తేనే మళ్లీ మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ఆసక్తి చూపుతుంటాయి. అయితే యద్ధం నేపథ్యంలో గుజ్జు ఎగుమతి లేదంటూ ఫ్యాక్టరీలు ఆవేదన చెందుతున్నాయి. ఈ తరుణంలోనే మే మొదటి వారం ముగుస్తున్నా ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని చర్చసాగుతోంది.
తిరుపతి అర్బన్: మామిడి రైతులకు ఈ ఏడాది గడ్డుకాలం తప్పేలాలేదు. గత ఏడాది ఓ వైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరోవైపు ఫ్యాక్టరీలు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతాపురికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.8 చొప్పున, ప్రభుత్వం రూ.4 చొప్పున కిలో రూ.12 గిట్టుబాటు ధర వస్తుందని రైతులు గత ఏడాది భావించినప్పటికీ అంతంత మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయేమోనని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
98,700 ఎకరాల్లో మామిడి సాగు
ఈ ఏడాది 98,700 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో 70 వేల ఎకరాల్లో తోతాపురి రకం సాగులో ఉంది. నీలం రకం 18,500 ఎకరాలు, బేనీసా రకం 10,200 ఎకరాలు సాగులో ఉంది. సాధారణంగా దిగుబడి బాగా వస్తే ఎకరం 5 నుంచి 7 టన్నులు వస్తుంది. గత ఏడాది మంచి దిగుబడి వచ్చింది. అయితే ధరలు లేవంటూ రైతులు ఆందోళన చెందారు. ఈ ఏడాది ఎకరం 3 నుంచి 4 టన్నులకు మించి రావడం లేదు. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రేట్లు లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు.
తగ్గిన రేట్లు
మామిడి అంటే ప్రధానంగా సాగులో ఉండేది తోతాపురి రకం. అయితే ఏ గ్రేడ్ రకం కిలో రూ.15, బీ గ్రేడ్ రకం రూ.10 నుంచి రూ.12 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు సరైన రేట్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సాధారణంగా ఫ్యాక్టరీలు మే మొదటి వారం నుంచి మామిడి కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఇంకా కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో రైతులకు టెన్షన్ తప్పడం లేదు. కోతకు మామిడి పంట సిద్ధంగా ఉంది. అయితే కొనుగోలు చేసేవారు కనిపించడం లేదు. మరోవైపు ఆకాల వర్షాలతో మామిడి రాలిపోతుందనే ఆందోళన రైతులను వేధిస్తోంది.
త్వరలో కొనుగోలు ప్రక్రియ
జిల్లాలోని ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనున్నాయి. అయితే వారి వద్ద 48 వేల మెట్రిక్ టన్నులు మామిడి గుజ్జు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది. మామిడిలో అత్యధికంగా తోతాపురి రకం సాగులో ఉంది. ఈ ఏడాది మామిడి నాణ్యత ఆధారంగా తోతాపురి కేజీ రూ.10 నుంచి రూ.15 వరకు రేట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గింది. జిల్లాలో గత ఏడాది 73,500 ఎకరాల్లో మామిడి సాగులో ఉండేది. ఈ ఏడాది రైల్వే కోడూరు నియోజకవర్గం జిల్లాలో చేర్చడంతో మామిడి సాగు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 98,700 ఎకరాల్లో మామిడి సాగులో ఉన్నట్లు లెక్కలు ఉన్నాయి. మొత్తంగా రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో మామిడి కోనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎన్. చిన్న రెడ్డెయ్య, ఇన్‌చార్జి జిల్లా అధికారి, ఉద్యానశాఖ


