తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పలు డిగ్రీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు తేదీలు, పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలు హాజరుకానున్న అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ వర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ ఓల్డ్ ప్యాటర్న్) పరీక్షలు జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మొదటి, రెండు, మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఎస్వీ జూపార్క్ క్యూరేటర్‌గా అనురాగ్ మీనా
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2020 బ్యాచ్ ఇండియన్ ఫా రెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి అనురాగ్ మీ నా బుధవారం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల (ఎస్వీ జూపార్క్) క్యూరేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ సంరక్షకుడిగా పదోన్నతి పొంది కర్నూలు సర్కిల్‌కు బదిలీ అయిన సెల్వం స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన అనురాగ్ మీనా వన్యప్రాణుల నిర్వహణలో తనకున్న అపారమైన అనుభవంతో కొత్తగా బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు రైల్వే కోడూరులో సబ్–డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సబ్–డీఎఫ్‌ఓ)గా, ఆ తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నంద్యాలలో ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విచ్చేసిన అనురాగ్ మీనాకు ఎస్వీ జంతు ప్రదర్శనశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
రేపు ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరై సుమారు 1,800కు పైగా పలు రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, డిప్లొమో అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


