రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం నుంచి బుధవారం చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులకు తాగు, రెండో పంట సాగుకు నీరు విడుదల చేసినట్లు తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్రమణ్యేశ్వరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్‌ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, నీటి స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాల కోసం 130 రోజుల్లో 13 టీఎంసీల 78 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చెన్న నగరానికి తాగు నీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగు నీటి కోసం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజ్‌కి 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని సెప్టెంబర్ 15వ తేదీ వరకు అంటే 130 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్‌బాబు, ఏఈ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


