విషమపరీక్ష | - | Sakshi
Sakshi News home page

విషమపరీక్ష

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

తిరుపతిలో పీజీసెట్‌ కేంద్రం లేమి

ఏపీపీజీ సెట్‌కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీయూ

పొరుగు జిల్లాలో సెంటర్లు కేటాయింపు

జిల్లా విద్యార్థులకు తప్పని తిప్పలు

ఎస్వీయూ పరిపాలనా భవనం

పీజీసెట్‌ అభ్యర్థులు సొంత జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే పరిస్థితి లేదు. ఏపీపీజీసెట్‌–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలోనే పరీక్ష కేంద్రం లేకపోవడంతో అభ్యర్థులు పొరుగు జిల్లాల్లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్యయప్రయాసల కోర్చి, పరీక్ష ముందు రోజే కేటాయించిన కేంద్రాలకు చేరుకుని అక్కడ బస చేయాల్సి వస్తోంది. దీంతో అభ్యర్థులు అవస్థలు పడాల్సి వస్తోంది.

తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా 17 యూనివర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీజీసెట్‌–2026కు ఆతిథ్యమిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలో పీజీసెట్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. తిరుపతి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తిరుపతి జిల్లా నుంచి పీజీ సెట్‌ పరీక్షకు హాజరవుతున్న వేలాదిమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదు.

3 వేల మంది దరఖాస్తు

రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీసెట్‌కు ఈ ఏడాది జిల్లా నుంచి సుమారు 3 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరు పరీక్ష రాసేందుకు తిరుపతి జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించలేదు. దీంతో వైఎస్సార్‌ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జిల్లా విద్యార్థులకు సెంటర్లను కేటాయించారు. శుక్రవారం నుంచి పీజీసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఒక రోజుముందే చేరుకుని వ్యయ ప్రయాసలకోర్చి సమీపంలోని హోటళ్లలో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.5 వేలు ఖర్చు అవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు.

అధికారులు చొరవ చూపాలి

ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు ఎస్వీయూ అధికారులు పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. గత ఏడాది పీజీసెట్‌ ప్రవేశ పరీక్ష సెంటర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడం, జిల్లా విద్యార్థులకు సెంటర్లు సుదూర ప్రాంతాల్లో కేటాయించడంతో వందలాది మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు.

గత మూడేళ్లగా దరఖాస్తుల వివరాలివీ..

కోర్సుల వివరాలు 2024లో 2025లో 2026లో

కెమికల్‌ సైన్స్‌ 8,551 6,070 3,581 లైఫ్‌ సైన్స్‌ 3,753 4,027 3,260

కంప్యూటర్‌ 2,975 2,333 1,884

కామర్స్‌ 2,215 1,438 980 ఇంగ్లిష్‌ 1,127 898 746

హ్యుమానిటీస్‌ 1,575 883 634 జువాలజీ 1,875 1,548 1,221 గణితం 2,200 1,175 835 ఫిజిక్స్‌ 1,495 938 653 బోటనీ 1,370 1,295 1,012 మిగిలిన అన్ని కోర్సులు 6,013 5,083 4,312 మొత్తం 30,934 25,688 19,118

ప్రవేశ పరీక్ష..తప్పని తిప్పలు

ఆదరణ కోల్పోతున్న ఏపీ పీజీసెట్‌

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీపీజీసెట్‌–2026కు ఆదరణ కరువవుతోంది. 17 యూనివర్సిటీల్లో 143 కోర్సులకు సంబంధించి 20 వేలకు పైగా సీట్లు ఉండగా కేవలం 19,118 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పీజీసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు 1:1 ప్రాతిపదికన సీట్లు కేటాయించినా పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోనున్నట్లు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోతుండటం యూనివర్సిటీలపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement