తిరుపతి అన్నమయ్యసర్కిల్: బీసీల ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల17న బీసీల మేధోమథన సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ విజయవాడ బెంజి సర్కిల్ వద్దనున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వివిధ బీసీ కుల సంఘ నాయకులు, ఉద్యోగులు, మేధావులు హాజరు కానున్నట్లు చెప్పారు. కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్టాలు చేయడానికి చేసిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభనపైన బీసీ నేతలు సుదీర్ఘంగా చర్చిస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించే అంశాల పైన చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.నాగమల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కంభం లోకయ్య, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి, అధికార తెలుగు భాషా సంఘం మాజీ సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, ఐటీ విభాగం మండల అధ్యక్షుడు శివ కోటి యాదవ్, బీసీ నాయకులు ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ తీగలు పడి వ్యక్తి మృతి
తిరుపతి రూరల్: విద్యుత్ తీగలు తెగిపడటంతో షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం కై లాసపురానికి చెందిన ఓబుల్ నాయుడు, ప్రభావతి దంపతులు పదేళ్ల క్రితం తిరుపతిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీకి వచ్చి నివాసముంటున్నారు. హమాలీగా పనిచేసే ఓబుల్ నాయుడు బుధవారం పనులు ముగించుకుని వర్షం ఆగిన తరువాత నడిచి వెళ్తుండగా తన ఇంటికి సమీపంలోని ఓ విద్యుత్ తీగ తెగి అతనిపై పడింది. షాక్‌కు గురైన ఓబుల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు.


