శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ పరిశ్రమకు భూమి పూజ | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ పరిశ్రమకు భూమి పూజ

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

శ్రీసిటీ (వరదయ్యపాళెం): ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ క్యారియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ అండ్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో తొలి తయారీ యూనిట్‌ కానుంది. మంత్రి లోకేశ్‌ దీనికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోడ్రన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ను కనిపెట్టడం నుంచి 50 బిలియన్‌ డాలర్ల గ్లోబల్‌ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్‌ ఎప్పుడూ ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. శ్రీసిటీలో పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. క్యారియర్‌ గ్లోబల్‌ చైర్మన్‌, సీఈఓ డేవిడ్‌ ఎల్‌ గిట్లిన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ క్యారియర్‌ భారత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

పెళ్లకూరు: మండలంలో గొర్రెల కాపరి బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వివరాలు.. పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన సంచి సిద్ధార్థన(52) బుధవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి గొర్రెలు మందను తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement