లోకేష్‌ అన్నా.. మా రోడ్ల కష్టాలు చూడరాదా? | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ అన్నా.. మా రోడ్ల కష్టాలు చూడరాదా?

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

● చిన్న పాండూరు–వరదయ్యపాళెం రోడ్డుకు మంజూరు కాని నిధులు ● దుస్థితిలో నాగలాపురం–చిన్న పాండూరు రోడ్డు ● నేడు శ్రీసిటీకి రానున్న లోకేష్‌

మొదలు కాని తడ–శ్రీకాళహస్తి రోడ్డు పనులు

వరదయ్యపాళెం: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఊపందుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే శ్రీసిటీకి అనుబంధంగా శ్రీకాళహస్తి–తడ, నాగలాపురం–చిన్న పాండూరు, ఊత్తుకోట వయా సత్యవేడు మీదుగా శ్రీసిటీ, వరదయ్యపాళెం–చిన్న పాండూరు రోడ్ల మీదుగానే శ్రీసిటీ వెళ్లే రోడ్లన్నీ దుస్థితికి చేరుకున్నాయి. ఈ రోడ్లన్నీ ధ్వంసమై వాహనచోదకులు, కార్మికులు రాకపోకలు సాగించలేక తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ పరిశ్రమకు భూమిపూజ చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ రానున్నారు. ఆయన హెలికాప్టర్‌లో రానున్నారు. ‘హెలికాప్టర్‌లో వస్తున్నారు..వెళుతున్నారు గానీ సత్యవేడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల దుస్థితి మీకు ఎలా తెలుస్తుంది.’ అని కార్మికులు, నియోజకవర్గ ప్రజలు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మీరు తెచ్చిన స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ లాగే రోడ్ల విషయంలోనూ శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

టెండర్లు పిలిచినా జరగని పనులు

శ్రీకాళహస్తి–తడ,వరదయ్యపాళెం–చిన్న పాండూరు రోడ్ల మరమ్మతులకు మూడు నెలల కిందట నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నా రు. అయితే ఇప్పటివరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

మంత్రి గారూ కాస్త స్పందించండి

సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడ పర్యటనకు రానున్న మంత్రి లోకేష్‌ రోడ్ల అభివృద్ధిపై స్పందించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. శ్రీసిటీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి తోడ్పాటు నివ్వాలని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement