తిరుమల : తిరుమలలో చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందికి దారి తీసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. షాపింగ్ సముదాయానికి ఎదురుగా ఉన్న బ్యాంకుల సముదాయంలో ఓ బ్యాంక్ మరుగుదొడ్డిలో నీటి కొళాయి ఆపకపోవడంతో రాత్రంతా నీరు పోతూనే ఉండడంతో, ఉదయం కల్లా యూనియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, తిరుపతి సహకార బ్యాంకు, కెనరా బ్యాంకుల్లోకి నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. సోమవారం సాయంత్రం ఎవరో నీటి కుళాయి తిప్పి ఆపకుండా వదిలేయడంతో మంగళవారం ఉదయం బ్యాంక్ మెట్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తొలగించారు.
విద్యార్థి ఈమెయిల్‌కు
రీవాల్యుయేషన్ ఫలితాలు
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాగంగా రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలను వారి సెల్‌ఫోన్ నంబర్లకు మెసేజ్ ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా పంపడం జరుగుతుందని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయంపై ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.


