చంద్రగిరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పతనం తమిళనాడు ఎన్నికల్లో మొదలై ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ముగుస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద సోమవారం టీవీకే అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలతో కలసి విజయోత్సవాల్లో పాల్గొన్న చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు.
ఆ ఇద్దరిదీ ఒకే నినాదం
ఏపీలో పార్టీలన్నీ ఒక వైపు.. జగనన్న మాత్రమే ఒక వైపు ఉన్నారనీ.. అలాగే తమిళనాడులో పార్టీలన్నీ ఒకవైపు.. విజయ్ పార్టీ ఒకవైపు నిలిచిందని హర్షిత్ రెడ్డి అన్నారు. జగనన్న లాగే ఆయన కూడా ఒంటరి పోరాటం చేశారనీ.. ఒంటరిగానే ప్రచారం చేశారనీ.. ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించారన్నారు.. తమ నాయకుడు జగనన్న ఎప్పుడూ చెబుతున్నట్టు సింహం సింగిల్‌గా వస్తుందని, ఆ ఇద్దరు ఒకే నినాదంతో ముందుకు వెళుతున్నారన్నారు. సింగిల్‌గా పోటీచేసి అద్భుతమైన విజయాన్ని విజయ్ సొంతం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. జగనన్న కటౌట్ పట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
తమిళనాడులో ప్రారంభమై..
ఏపీలో ముగుస్తుంది..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల్లో ఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారో వారంతా ఓటమి పాలయ్యారన్నారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రారంభమైన చంద్రబాబు పతనం ఏపీలో జరగబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌తో ముగుస్తుందన్నారు. టీడీపీ పతనానికి అదే నాంది అవుతుందన్నారు.
టీవీకే అభిమానుల సంబరాలు
చంద్రగిరి టవర్ క్లాక్‌వద్ద టీవీకే అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో టీవీకే అధినేత విజయ్ తీసుకున్న ఫొటోను ప్లెక్సీలుగా, ప్లకార్డులుగా ముద్రించి ప్రదర్శనగా టవర్ క్లాక్ వద్దకు తీసుకువచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి విజయ్ విజయోత్సవాన్ని ఆనందాన్ని తెలుపుతూ భారీ కేక్ కట్‌చేశారు. వైఎస్సార్‌సీపీ, టీవీకే పార్టీ జెండాలతో ఆకర్షణీయంగా తయారు చేయించిన భారీ కేక్‌ను చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి కట్‌చేసి విజయ్ అభిమానులు అందరికీ పంచి పెట్టారు.


