పోలీస్‌ గ్రీవెన్స్‌కు 72 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 72 అర్జీలు

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్‌ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీ లు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

రేపటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి సిటీ: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ జూనియర్‌ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు టీటీడీ డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బుధవారం నుంచి వచ్చేనెల 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు, హెల్ప్‌లైన్‌ డెస్క్‌ నంబర్ల కోసం https://admission.tirumala.org వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సూచించారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

తిరుపతిరూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించకూడదని ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి సూచించారు. సోమవారం ఉదయం డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంలో జాప్యాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించేందుకు సంస్థ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ ఖాన్‌, కే. గురవయ్య, కె. రామమోహన్‌ రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

రైలు ఢీ కొని వ్యక్తి మృతి

ఓబులవారిపల్లె : పుల్లంపేట మండలం, రెడ్డిపల్లి సమీపంలో సోమవారం నంద్యాల రేణిగుంట డెమో రైలు ఢీకొని పులియాల మహేష్‌ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పుల్లంపేట మండలం, కేతరాజుపల్లి గ్రామానికి చెందిన మహేష్‌ రెడ్డిపల్లి సమీపంలో రైలు పట్టాలుపై ప్రమాదవశాత్తు రైలు ఢీ కొంది. రైలు ముందు భాగంలోని కల్పింగ్‌ వద్ద మృతదేహం, తలభాగం ఇరుక్కుపోయింది. దీంతో అక్కడికక్కడే మహేష్‌ మృతి చెందాడు. మృతదేహం తీసేందుకు వీలుకాకపోవడంతో పరిశీలించిన డ్రైవర్‌ రెడ్డిపల్లి నుంచి ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌ వరకు మృతదేహాన్ని రైలు ఈడ్చుకుంటూ వచ్చింది. దీంతో కింద వేలాడుతున్న కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌లో దాదాపు రైలు గంటసేపు నిలిచిపోయింది. మృతుడు ఓబులవారిపల్లి మండలం, బొంతవారిపల్లిలో వివాహం చేసుకుని ఉండడంతో బంధువులు రైల్వేస్టేషన్‌కు చేరుకుని గుర్తించి వేలాడుతున్న మృతదేహాన్ని బయటకు లాగారు.

గంగమ్మ జాతరకు

పటిష్ట బందోబస్తు

తిరుపతి క్రైం : మంగళవారం నుంచి ప్రారంభమయ్యే గంగ జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ప్రశాంతంగా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు తెలిపారు. గంగమ్మ జాతర తిరుపతి నగరానికి ఆధ్యాత్మికంగా, సంప్రదాయపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదన్నారు. పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఇక తిరుపతి సబ్‌డివిజన్‌ డీఎస్పీ బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.

జాతర ఏర్పాట్ల పరిశీలన

తిరుపతి తుడా: తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శారదాదేవి సోమవారం పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ అప్పగించిన విధులను ఆయా విభాగాల అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. సమన్వయంతో సమష్టిగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement