తిరుపతి తుడా: ‘‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పై రోజురోజుకూ అధికార పార్టీ కార్యకర్తలు, నేతల దాడులు అధికమయ్యాయి. దశరథరామిరెడ్డికి రెండు కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తలపై తీవ్రంగా గాయపరిచారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మాత్రం దుండగులపై కేసులు పెట్టకుండా దశరథరామిరెడ్డిపైనే కేసు నమోదు చేశారు. అధికారపార్టీకి కొమ్ముకాయకుండా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలి’’ అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని సోమవారం సాయంత్రం వారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఎవరైతే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దశరథరామిరెడ్డిపై దాడి దారుణం
రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై కూటమి నేతలు విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైఎస్సాఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, రైల్యేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం వారు దశరథరామిరెడ్డి సతీమణితో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటిలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అన్యాయంగా కల్యాణ మండపాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిపై నిలదీసిన దశరథరామిరెడ్డిపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


