తిరుపతి అర్బన్: అర్జీలను నిశితంగా పరిశీలించి..వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు 307 అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి పాల్గొని, అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై అధికంగా 172 అర్జీలను అందుకున్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేస్తున్నారు!
వెంకటగిరిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమించేస్తున్నారని పలు పార్టీలకు చెందిన నేతలు, పూర్వ విద్యార్థుల సంఘం, రైతు కూలీ సంఘం నేతలు, స్థానికులు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బీకే ప్రసాద్, వైఎస్సార్ సీపీ నేత చిట్టేటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వితంతువు పింఛన్ ఇప్పించండి
తన భర్త మృతి చెందాడని, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, పెద్ద కుమారుడు జస్వంత్(6ఏళ్లు) దివ్యాంగుడని, తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని తిరుపతికి చెందిన నరసమ్మ కోరారు. తనకు రేషన్‌కార్డు కూడా లేదన్నారు.
కార్మికులను తొలగిస్తే...అదనపు భారం
పుత్తూరు సీహెచ్‌సీలో 8 మంది శానిటేషన్ కార్మి కులు పనిచేస్తుంటే ఇద్దరు తొలగించడంతో తమపై అదనపు పని భారం పడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.


