పాకాల: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో కారులో ముందు సీట్‌లో కూర్చోన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని దామలచెరువు సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు కథనం మేరకు.. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన నాగరాజు, అతని కుటుంబ సభ్యులతో కలసి ఏప్రిల్ 30వ తేదీన రైలులో తిరుమలకు ప్రయాణమయ్యారు. సోమవారం దర్శనం చేసుకున్న అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ప్రైవేట్‌గా ఏపీ29ఏబి6219 నంబర్ కారును బుక్ చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 2 గంటలకు దామలచెరువుకి సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై గుండ్లగుట్టపల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ముందు సీటులో నాగరాజు(36) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్‌ఐ తరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


