మందులు లేవు | - | Sakshi
Sakshi News home page

మందులు లేవు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

రోగులను పట్టించుకోని వైద్యులు

అదే బాటలో ఇతర ఉద్యోగులు

పూర్తిస్థాయిలో అందుబాటులో లేని

వెంటిలేటర్లు

గత వైఎస్సార్‌సీపీ హయాంలో పేదలకు పక్కాగా సేవలు

చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన సర్కారు వైద్యశాలలు

మాది పీలేరు. నేను 15 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. తరచూ రుయాకు వచ్చిపరీక్షించుకుని మందులు వాడుతున్నా. అయితే ఇటీవల రెండు మార్లు ఆస్పత్రికి వచ్చినప్పటికీ వైద్యులు సూచించిన మందులు రుయాలో లేవు. దీంతో నాలుగు రకాల మందులను బయటి దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆస్పత్రికి వచ్చేందుకే ఇబ్బందిపడుతున్నాం. మందులు కూడా మేమే కొనుక్కోవాలంటే ఆర్థిక భారం భరించలేం. – రఫీ, రోగి, పీలేరు

కొన్ని బయట తీసుకోమన్నారు

మాది వెంకటగిరి, నేను నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు తీవ్రంగా గాయపరచాయి. వెంకటగిరి వైద్యులు రుయా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమన్నారు. మార్చి 30వ తేదీన రుయాకు వచ్చాను. వైద్యులు పరీక్షించి నెల రోజుల పాటు ఏడు రకాల మందులు వాడమని సూచించారు. మందుల దుకాణానికి వెళితే నాలుగు రకాలే ఉన్నాయన్నారు. మిగిలిన మూడు రకాల మందులను బయటి షాపులో కొనుక్కోమన్నారు. అవి రూ.3వేలు అవు తాయని చెప్పారు. – భాస్కర్‌, రోగి, వెంకటగిరి

సరిగా చూడడం లేదు

మాది తండలం.నేను కొన్ని రోజులుగా చర్మ వ్యాధితో బాధపడతున్నా. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని స్థితిలో రుయాకు వచ్చా. ఇక్కడ ఆశించిన స్థాయిలో వైద్యం అందలే దు. వైద్యులు సక్రమంగా పరీక్షించకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యా. పెద్ద డాక్టర్లు లేరని చెప్పడంతో చిన్న డాక్టర్ల వద్దే వైద్యం చేయించుకున్నా. వైద్యులు ఇచ్చిన చీటీ ప్రకారం మందులు సైతం ఇవ్వలేదు. బయట కొనుగోలు చేయాల్సివచ్చింది. – రాధాకృష్ణ, వ్యాధిగ్రస్తుడు, తండలం

జిల్లా సమాచారం

జిల్లా స్థాయి ఆస్పత్రి 01

ఏరియా హాస్పిటళ్లు 03

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు 26

పీహెచ్‌సీలు 58

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు 432

తిరుపతి తుడా : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరు దారుణంగా తయారైంది. చంద్రబాబు సర్కారు అలసత్వంతో పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కనీసం మందులు కూడా అందుబాటులో లేని దుస్థితి దాపురించింది. ఆరోగ్య రక్షణకు అభయమిచ్చే వారే కరువై పేదలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

చూసీచూడనట్టే విధులు

రుయాలో రూ.లక్షల వేతనాలు తీసుకుంటున్న వైద్య అధ్యాపకులు కనీసం రోగుల నాడిపట్టేందుకు కూడాఆసక్తి చూపడం లేదు. కొన్ని విభాగాల్లో ఓపీకి రావడమే మానేశారు. దీంతో పీజీ వైద్యులే దిక్కుగా మారారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో ఫైనల్‌ ఇయర్‌ ఎంబీబీఎస్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో హౌస్‌ సర్జన్‌ల కొరత తల్తెతడం గమనార్హం. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఏడాది పాటు చదువుకున్న కళాశాలలోనే ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిఉంటుంది. ఫిబ్రవరిలో కొత్త ఇంటర్నషిప్‌ బ్యాచ్‌ ఆందుబాటులో ఉండాల్సి ఉంది. పరీక్షల ఆలస్యం కారణంగా 240 మంది హౌజ్‌సర్జన్లు అందుబాటులోకి రాకుండా పోయారు. అలాగే రోగులను మందుల కొరత వేదిస్తోంది.అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో సగం మందులు ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి రావడం పేద రోగులకు భారంగా మారింది.

నాడు పెద్దపీట.. నేడు చిన్నచూపు...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రధానంగా రుయాలో మౌలిక వసతుల మెరుగునకు రూ.450కోట్లు మంజూరు చేశారు. వందల సంఖ్యలో నర్సింగ్‌, టెక్నికల్‌ స్టాఫ్‌ను నియమించారు. అదే స్థాయిలో వైద్య అధ్యాపకుల నియామకాలను చేపట్టి పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 250 రకాల మందులు నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టారు. ల్యాబ్‌లను ఆధునికీకరించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ చేపట్టారు. ఇంటి వద్దకే వైద్యం, ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో వైద్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. పేదలందరికీ ఖరీదైన చికిత్సలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 4వేల రకాల వ్యాధులను తీసుకువచ్చారు. ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమైన నిధులు విడుదల చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేదలకు సక్రమంగా వైద్యం అందని దుస్థితి దాపురించింది.

ఎఫ్‌ఎన్‌ఓలు అందుబాటులో లేకపోవడంతో వృద్ధురాలిని తీసుకెళుతున్న ఆమె మనవడు

వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత

పేదల పెద్దాస్పత్రిగా పేరుపొందిన రుయాను వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆర్‌ఐసీయూలో వైద్యం కోసం వచ్చే రోగులకు వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడం ప్రాణాలమీదకు తెస్తోంది. ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అరకొర వెంటిలేటర్లతోనే వైద్యులు నెట్టుకొస్తున్నారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, నాయుడుపేట ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. 1,100 పడకల సామర్థ్యంతో నిర్వహిస్తున్న రుయాలో ప్రస్తుతం 172 మాత్రమే వెంటిలేటర్లు ఉన్నాయి. మరో 100 వెంటిలేటర్లు అవసరం ఉన్నప్పటికీ, సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

నిద్రావస్థలో ప్రభుత్వాస్పత్రులు

రోగుల బాధ్యత పట్టదు

రోగి వ్యాధి తీవ్రతను బట్టి ఒక చోటు నుంచి మరో వార్డుకు, ఎక్స్‌రేలకు తీసుకెళ్లడం సహజం. ఈ క్రమంలో రోగి సహాయకులుగా ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను నియమించాల్సి ఉంది. కానీ, రుయాలో సిబ్బంది కొరత కారణంగా పేషెంట్‌ అంటెడర్లే పరుగులు తీయాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం రుయాలో 400 మంది ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓల అవసరముంది. అయితే ప్రస్తుతం కేవలం 70 మంది మాత్రమే సేవలు అందిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎఫ్‌ఎన్‌ఓ, ఎమ్‌ఎన్‌ఓలు పేద రోగుల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement