డిగ్రీ అడ్మిషన్లు చేపట్టలేని
దుస్థితిలో కళాశాలలు
అనుమతి కోరడంలో
విఫలమవుతున్న అధికారులు
ఉన్నత విద్యామండలి చేతిలోనే
సర్వాధికారాలు
మినహాయింపు ఇవ్వాలంటున్న విద్యావేత్తలు
అటానమస్ హోదా సాధించాం.. సొంతంగా కళాశాలల పరిపాలన సాగిస్తామని టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు గొప్పలు చెప్పుకున్నాయి. అయితే ఇప్పటికీ సర్వాధికారాలు ఉన్నత విద్యామండలి గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీలు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కనీసం డిగ్రీ అడ్మిషన్లు సైతం చేపట్టలేని దుస్థితిలో చిక్కుకున్నాయి. కేవలం పరీక్షల నిర్వహణ.. ఫలితాల విడుదల మినహా చేసేదేమీ లేక చేతులు కట్టుకుని కూర్చున్నాయి. ఈ క్రమంలో అటానమస్ కళాశాలలకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతిష్టాత్మక టీటీడీ ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల
సమాచారం
కళాశాల విభాగాలు మొత్తం సీట్లు
పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 21 1,550
ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ 20 1.417
ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల 10 1,068
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్, పద్మావతి, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా పొంది రెండేళ్లకు పైగా గడుస్తోంది. కానీ, ఇప్పటి వరకు కేవలం పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తప్ప సొంతంగా వేరే నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం స్వతహాగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టలేకపోతున్నాయి.
ఓఏఎమ్‌డీసీ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం కామన్ వైబ్‌సైట్ ఓఏఎమ్‌డీసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అడ్మిషన్లు భర్తీ చేసే ప్రక్రియ కొంత కాలంగా కొనసాగుతోంది. ఓపెన్ కాంపిటేషన్ కావడంతో పేరొందిన టీటీడీ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకు ప్రధాన కోర్సులలో ప్రవేశాలు దొరకడం లేదు. దీంతో ప్రస్తుతం అటానమస్ పొందిన టీటీడీ డిగ్రీ కళాశాలలను ఓఏఎమ్‌డీసీ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చి సొంతంగా అడ్మిషన్లు చేపట్టుకునే వెసులుబాటు కల్పించాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఓఏఎమ్‌డీసీ ప్రక్రియ కారణంగా గత ఏడాది సుమారు 120మంది స్థానిక విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుపయోగంగా
స్వయం ప్రతిపత్తి
టీటీడీ అధికారులు చొరవ చూపాలి
పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియపై టీటీడీ యాజమాన్యం చొరవ చూపాలని విద్యావేత్తలు కోరుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతుల దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే సొంతంగా అడ్మిషన్లు చేపట్టేందుకు టీటీడీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


