తిరుమలలో విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

తిరుమల: వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపడుతోంది. రూ.2 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.5 లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా అందుబాటులో ఉంచారు.

శ్రీవారి దర్శనానికి

16 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 91,005 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,257 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్‌’

తిరుపతి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్నిశాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement