లేదు మాకు సాటి.. నత్తతోనే పోటీ! | - | Sakshi
Sakshi News home page

లేదు మాకు సాటి.. నత్తతోనే పోటీ!

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

● నెలలోపు పూర్తి చేస్తామన్న అధికారులు ● 20 రోజులు గడిచినా అరకొరగానే పనులు

రేణిగుంటలో అండర్‌ బ్రిడ్జి మరమ్మతులు

ఇప్పటికి 50 శాతమే పూర్తి

అండర్‌ బ్రిడ్జిని మూసివేసి ఇప్పటికి 20 రోజులు గడిచినా ఇప్పటికీ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో పది రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించడం అనుమానమే అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు మాత్రం ఈ నెల 15 నుంచి 20వ తేదీలోపు అండర్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతుండడం గమనార్హం.

రేణిగుంట : రేణిగుంట పట్టణంలోని ప్రధాన ప్రవేశ ద్వారమైన రైల్వే అండర్‌ బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా ఏప్రిల్‌ 12వ తేదీన మూసివేశారు. కేవలం నెలరోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికే 20 రోజులు గడిచినా అరకొరగానే పనులు పూర్తి చేశారు. దీంతో రేణిగుంటవాసులు, వాహనదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన పనులు సాగుతున్నాయని, అధికారులు చెప్పినట్టు నెలలో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.

ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం

ప్రధాన రహదారిని మూసివేసిన తర్వాత వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో అధికారులు వైఫల్యం చెందారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే రహదారిని మూసివేసే సమయంలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టడంలో నిర్లక్ష్యం వహించారు. చివరకు రేణిగుంటలోని సంత మార్గాన్ని తాత్కాలిక రహదారిగా ప్రకటించి వదిలేశారు. అక్కడి రైల్వే గేట్‌ కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో స్థానికులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైల్వే అండర్‌ బ్రిడ్జి పక్కనే మరో అండర్‌ బ్రిడ్జి వద్ద తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. కనీసం ఆ దారికి అయిన మరింతగా మెరుగులు దిద్దేందుకు అధికారులు ముందుకు రాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement