కూలిన షెడ్‌.. మందుబాబులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

కూలిన షెడ్‌.. మందుబాబులకు గాయాలు

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

● కొడుకు సంవత్సరీకం రోజే తల్లి మృతి ● చుక్కలనిడిగల్లులో విషాదం

రేణిగుంట: పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన కారణంగా ఓ మద్యం దుకాణం వద్ద వేసి షెడ్‌ కూలిపోయింది. అదే సమయంలో షెడ్‌లో మద్యం తాగుతున్న పలువురిపై పడిపోయింది. దీంతో మందుబాబులు గాయపడ్డారు. అయితే విషయం బయటకు పొక్కకుండా వైన్‌షాపు నిర్వాహకులు గుట్టుగా బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది.

వృద్ధురాలి దారుణ హత్య

తిరుపతి రూరల్‌ : తిరుపతి రూరల్‌ స్టేషన్‌ పరిధిలోని చెర్లోపల్లెలో శనివారం రాత్రి ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మృతురాలు లోకేశ్వరి (60) ఒంటరిగా ఉండడం, ఆరోగ్య సమస్యలు సైతం ఉండడంతో ఆమె మరణంపై ఎవరికీ అనుమానం రాలేదు. కుటుంబీకులు కూడా లోకేశ్వరి అనారోగ్యంతోనే మృతి చెందినట్లు భావించారు. ఆదివారం ఈమేరకు దహన క్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే మృత దేహానికి స్నానం చేయించే సమయంలో ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సీఐ మద్దయ్య ఆచారి చేరుకుని మృతదేహంపై గాయాలను పరిశీలించారు. మృతురాలి కుమారుడు ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోకేశ్వరి ఇంటిపై అంతస్తులో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానితులుగా గుర్తించారు. వృద్ధురాలి ఒంటిపై నగల కోసం గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వేలిముద్రలు సేకరించారు. అనంతరం అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోకేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.

అయ్యో..తల్లీ!

శ్రీకాళహస్తి రూరల్‌: ‘కొడుకు చనిపోయిన బాధ ఏడాది పాటు గుండెల్లో గునపంలా పొడుచుకుంది. సంవత్సరీకం జరుపుతుంటే చూస్తూ ఓర్చుకోలేకపోయింది. కొడుకు ఫొటో ఎదుట గుండలవిసేలా రోదిస్తూ అక్కడే సొమ్మసిల్లిపోయింది. కొడుకు మరణించిన రోజే తల్లి కూడా ప్రాణాలు వదిలేసింది’ ఈ విషాద ఘటన శ్రీకాళహస్తి మండలం, చుక్కలనిడిగల్లు దళితవాడలో చోటు చేసుకుంది. వివరాలు.. చుక్కలనిడిగల్లు దళితవాడకు చెందిన పెరిమిడి బాలాజీ, రాజేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడు మురళి ఏడాది క్రితం పూతలపట్టు గురుకుల పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచాడు. ట్రిపుల్‌ ఐటీ న్యూజివీడులో సీటు సంపాదించాడు. అయితే గత ఏడాది మార్చిలో ఇంటికొచ్చిన మురళి స్నేహితులతో కలిసి తెలుగుగంగ కాలువలో ఈతకొట్టేందుకెళ్లి మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి కుటుంబీకులతోపాటు తల్లి రాజేశ్వరి కుమిలిపోతూ వచ్చింది.

కొడుకు చనిపోయిన రోజే మృత్యుఒడికి

తనయుడు మురళి చనిపోయి ఏడాది పూర్తవడంతో కుటుంబీకులు ఆదివారం సంవత్సరీకానికి ఏర్పాట్లు చేశారు. తల్లి రాజేశ్వరి కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అతని ఫొటో వద్దే కుప్పకూలిపోయింది. కుటుంబీకులు హుటాహుటిన శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే రాజేశ్వరి మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది వ్యవధిలోనే తల్లీకొడుకు మృత్యుఒడికి చేరడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

రైలు కింద పడి వ్యక్తి మృతి

పాకాల : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడు చంద్రగిరివారిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన వై.కృష్ణయ్యగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement