అర్హులకు విద్యుత్‌ సబ్సిడీ అందాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు విద్యుత్‌ సబ్సిడీ అందాలి

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: విద్యుత్‌ సబ్సిడీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విద్యుత్‌ కమిటీ సమీక్షలో కమిటీ చైర్మన్‌ హోదాలో ఎంపీ మాట్లాడారు. కొన్ని ప్రాంతాలు సబ్సిడీ పరిధిలోకి రాకపోవడం వల్ల రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్‌ పథకంపై పట్టణ ప్రాంతాల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలు చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. వ్యవసాయ అవసరాల కోసం పీఎం కుసుమ్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీర, మెట్ట ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో సోలార్‌ ఎనర్జీపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాలలోని చెరువు కట్టల వద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అవకాశాలపై ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా గ్రామాల్లో విద్యుత్‌ నష్టాలను తగ్గించేందుకు వీధి దీపాలను ఆటోమెటిక్‌ వ్యవస్థలతో అమలు చేయాలన్నారు. దీని ద్వారా విద్యుత్‌ ఆదా చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement