● గొప్ప చదువుల వైపు ఆడబిడ్డలు అడుగులు.. ● దూరచూపుతో గొప్ప సంకల్పంతో నిర్ణయాలు ● ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు ● జిల్లాలో ముందు వరుసలో బాలికలు..
విసుగంటే ఏమిటో తెలియదు.. వారికి
పుస్తకాలే పవిత్ర గ్రంథాలు.. లక్ష్యసాధనే ధ్యేయం.. ఉన్నత శిఖరాలకు చేరి
తల్లిదండ్రుల కష్టాలు తీర్చడమే లక్ష్యం..
అందుకు పక్కా ప్రణాళికలే పరమావధి.. విరామంటే వారు ఎరుగరు.. చదువే వినోదం, విహారం.. వారికి తెలిసిందల్లా ఏకోన్ముఖ దీక్షే.. అదే ధ్యాస మనస్సు నిండా నిండింది.. బంగారు భవిత కళ్ల ముందు
సాక్షాత్కరించింది. పది విజయసారథుల మనోగతంపై ప్రత్యేక కథనం.
పది పాస్ అయ్యింది...అయితే పెళ్లి చేద్దామనే కాలానికి నూకలు చెల్లాయి. పది ఉత్తీర్ణతతో ఆగిపోకుండా లక్ష్యం వైపు బాలికలు గురిపెడుతున్నారు. చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు.. కొందరు విద్యార్థులకు ఆర్థిక కష్టాలు, మరికొందరు విద్యార్థులకు కుటుంబ కష్టాలు..అయినప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యం చదువువైపే సాగడంతో టెన్త్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాలో ముందువరుసలో నిలబడ్డారు. అంతటి చదువులు ఆగకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ, డాక్టర్స్, ఇంజినీర్లు, ఉపాధ్యాయులుగా పనిచేయాలనే లక్ష్యంతో పునాదులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయుల ప్రోత్సాహం మేరకు గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారి అభిమతం వారి మాటల్లోనే.. – తిరుపతి అర్బన్
నా లక్ష్యం ఐఏఎస్
నా లక్ష్యం ఐఏఎస్ చదవడమే. చదివించడానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. నా తల్లి పి. నిర్మల, తండ్రి ఎస్.జగన్నాథం ఇద్దరు ఉపాధ్యాయులు. అయినప్పటికీ ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని సూచించారు. ఆ దిశగా చదువుకోవడానికి వరదయ్యపాళెంలోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు సైతం ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. దాంతోనే పదిలో 595 మార్కులు సాధించా. అదే స్ఫూర్తితో ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నాను. –ఎస్. దిశితసాయి, వరదయ్యపాళెం
డాక్టర్ కావాలన్నదే నా ఆశయం
నా జీవిత ఆశయం డాక్టర్ కావడమే. పేద కుటుంబానికి చెందిన వాళ్లం, మా తల్లిదండ్రులు పి. నాగరాజు, పి. సంపూర్ణ ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ నన్ను కష్టపడి చదివించారు. దానికితోడు శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు హైస్కూల్‌లోని ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. దాంతోనే టెన్త్‌లో 591 మార్కులు సాధించాను. డాక్టర్ కోర్సు పూర్తి చేసి..పది మంది పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని భావిస్తున్నాను.
–పి. మోహిత్ చరణ్ సాయి,
చల్లపాళెం


