చంద్రగిరిలో రౌడీ రాజ్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రౌడీ రాజ్యం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

ఎమ్మెల్యే నానీ అనుచరుల అరాచకం! నడిరోడ్డుపై వైఎస్సార్‌సీపీ రైతు నాయకుడిని హతమార్చే కుట్ర నోటి నుంచి రక్తం కారుతున్నా వదలని రౌడీ మూకలు ప్రెస్‌మీట్‌లో నాని అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే టార్గెట్‌ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ‘చంద్రగిరి ఎమ్మెల్యే నానీ అనుచరులు అరాచకం సృష్టించారు. నడిరోడ్డుపై వైఎస్‌ఆర్‌సీపీ నేతను చుట్టుముట్టి హతమార్చేందుకు కుట్ర పన్నారు. నోటి నుంచి రక్తం కారుతున్నా వదిలిపెట్టకుండా దాడి చేశారు. నానీ అన్న గురించి ఎక్కడైనా, ఎవరైనా మాట్లాడితే చంపేస్తామంటూ హెచ్చరించి అక్కడి నుంచి పరారయ్యారు.

అసలేం జరిగిందంటే..

తిరుపతి జిల్లా పాకాల మండలం, ఆదెనపల్లి పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన జిల్లా వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాధవనాయుడు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో తమ బంధువు వివాహానికి ద్విచక్ర వాహనంపై శుక్రవారం బయలుదేరాడు. కల్యాణ మండపం సమీపంలోని స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న శ్రీసాయిబాబ ఆలయం వద్ద మాధవనాయుడు తన ద్విచక్ర వాహనాన్ని ఆపి దండం పెట్టుకుంటుండగా అప్పటికే ఆయన్ను అనుసరిస్తూ రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు ఎమ్మెల్యే నాని అనుచరులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మాధవనాయుడు తలపై గట్టిగా గుద్దడంతో ఆయన బోర్లాపడిపోయారు. ఆ తరువాత కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ భయానకం సృష్టించారు. ఓ వైపు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్నా నోట్లో పళ్లు ఊడిపోయి అరుస్తున్నా వదలలేదు. అంతేగాక ‘‘రేయ్‌ వీడిని చంపేయండి రా, మన నానీ అన్నకే వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు.. గత ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్‌గా, కౌంటింగ్‌ ఏజెంటుగాకూర్చున్నాడు..’ అంటూ మాధవ నాయుడుపై అత్యంత పాశవికంగా చంపేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు చూస్తున్న వాహనదారులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో వదిలిపెట్టారు. తర్వాత బాధితుని సెల్‌ఫోన్‌ లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రరక్త గాయాలతో మాధవ నాయుడు చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు.

చంపేందుకు పక్కాగా స్కెచ్‌

శ్రీనివాసపురం నుంచి మాధవనాయుడు బయల్దేరిన సమయంలో పులివర్తివారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రామిరెడ్డి తనను కొంత దూరం అనుసరించి ఎవరికో సమాచారం అందించినట్టు మాధవ నాయుడు పోలీసులకు వివరించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్‌గా, కౌంటింగ్‌ ఏజెంటుగా నిలబడడంతో అప్పట్లో తనపై దాడికి ప్రయత్నించారన్నారు. ఆ తరువాత గత పదిహేను రోజుల క్రితం పాకాల మండల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాను పాల్గొని ఎమ్మెల్యే నానీ అరాచకంపై ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపించారు. తనపై జరిగిన హత్యాయత్నంకు రామిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఆయన పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement