● జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలు
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, పలు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్–2026 శనివారం నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఐసెట్ పరీక్షకు తిరుపతి జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 790 మంది, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో 180 మంది, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో 300 మంది, పుత్తూరు వద్ద ఉన్న శ్రీ వెంకటేశ పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 328 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగే ఐసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన
తిరుపతి సిటీ: ఎస్వీయూలో జరుగుతున్న పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను శుక్రవారం వీసీ టాటా నర్సింగరావు, ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ కే సురేంద్రబాబు పరిశీలించారు. వర్సిటీలోని సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరు గమనించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 59,186 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,244 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
అటవీశాఖ సీసీఎఫ్‌గా శ్రీనివాసులురెడ్డి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సీసీఎఫ్)గా వై.శ్రీనివాసులురెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఇన్‌చార్జి సీసీఎఫ్, జూపార్కు క్యూరేటర్ సెల్వంను కర్నూలుకు బదిలీచేశారు. కాగా జూపార్కు క్యూరేటర్‌గా అనురాగ్ మీనా నియమించినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
ఐసర్‌లో ప్రొఫెషనల్ మాస్టర్స్ కోర్సులు
ఏర్పేడు: మండలంలోని తిరుపతి ఐసర్‌లో ఏఐ సంబంధిత నూతన కోర్సులను అందుబాటులోకి వచ్చాయి. సంవత్సర కాల వ్యవధితో ప్రొఫెషనల్ మాస్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా బయలాజికల్ డేటాసైన్స్, డేటాసైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తు తిరుపతి ఐసర్ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచింది. 60 శాతం పైగా మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్), బీఈ, బీటెక్, నాలుగేళ్ల బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణత (లేదా) 55శాతం పైగా మార్కులతో ఎంఎస్, ఎంఎస్‌సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి గల వారు ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జూలై నుంచి కోర్సు ప్రారంభం కానుంది. దరఖాస్తులను linktr.ee/iisertmasters వెబ్‌సైట్‌లో చేసుకోవాలి.


