కల్యాణం.. కడు రమణీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కడు రమణీయం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

● శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహుడి పెళ్లి ● వేడుకగా రథోత్సవం ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

రథోత్సవంలో పాల్గొన్న భక్తజన సందోహం

భక్తులకు మంగళసూత్రాలుచూపుతున్న వేదపండితులు

రాపూరు : పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం కడు రమణీయంగా జరిగింది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 9.50 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, పల్లకిలో కొలువు దీర్చి కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అంతకుముందు విష్వక్సేనపూజ నిర్వహించారు. అశేష భక్తజన సందోహం గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పుష్పయాగం చేశారు. ఈ కల్యాణం మహోత్సవానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు,ే ఉత్సవ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, సోమయ్య, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు. కాగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మూహుర్తానికి పలు నూతన జంటలు కోనలో ఒక్కటయ్యాయి. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పెంచలకోన కిక్కిరిసింది. బ్రహోత్సవాల సందర్భంగా పెంచలకోనలో వేపినాపి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య బృందం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని నెల్లూరు జిల్లా అడిషినల్‌ డీఎంహెచ్‌ఓ ఖాజావల్లి తనిఖీ చేశారు. అలాగే కీర్తి శేషులు డాక్టర్‌ కృష్ణయ్య, రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం ఆర్‌ఎంపీ వైద్యబృందం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత సేవలతోపాటు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు చంద్రశేఖర్‌, మస్తాన్‌బాబు, శివప్రసాద్‌, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు చక్రస్నానం, తెప్పోత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు వసంతోత్సవం, 9 గంటలకు చక్రస్నానం, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 9 గంటలకు అశ్వవాహనసేవ, 11 గంటలకు ధ్వజావరోహణం జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement