ఏర్పేడు: గుడిమల్లంలోని ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరుని ఆలయంలో ఇటీవల జరిగిన మహాకుంభాభిషేకం మాటున ఆలయ ప్రధాన గోపురంపై ఏన్న వేల ఏళ్ల నాటి కలశాల తొలగించిన తీరుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపి, అక్రమాలను నిగ్గు తేల్చాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుడిమల్లం ఆలయానికి చేరుకున్న ఆయన నూతన కలశాలను పరిశీలించారు. వేల ఏళ్ల నాటి ఆలయ గోపుర కలశాలను తొలగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఆ కాలంలో వజ్ర, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, కెంపులు, బంగారు ఆభరణాలను వీధుల్లో రాశులు పోసి విక్రయించే వారని, ఈ నేపథ్యంలో నాటి రాజులు నిర్మించిన కలశాలు కేవలం సున్నం నింపి ఏర్పాటు చేస్తారని తాను భావించడం లేదన్నారు. ఆలయ కలశాలను తొలగించే క్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో అన్ని కోణాల్లో వీడియో చిత్రీకరించి, సరైన పంచనామాతో చేపట్టాల్సిన కార్యాన్ని కనీసం ఆలయ ఈఓ కూడా లేకుండా ప్రైవేటు వ్యక్తులు తొలగించడం మహాపచారమన్నారు. ఇందులో పెద్ద కుట్రకోణం దాగి ఉందన్నారు. తొలగించిన కలశాలను, వాటి అవశేషాలను భక్తులందరూ తిలకించే రీతిలో ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనగా పెట్టాల్సింది పోయి అవశేషాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి చూస్తుంటే కలశాల తొలగింపు వ్యవహారంతో పెద్దస్థాయిలో అక్రమాలు జరిగినట్లు భక్తులను అనుమానాలున్నాయన్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి ఎందుకు ఆగమ శాస్త్ర నిబంధనలను తుంగలో తొక్కి, చారిత్రక కట్టడానికి సంబంధించిన పవిత్ర కలశాలను భక్తుల కళ్లుగప్పి తొలగించి, అందులోని విలువైన వజ్రవైఢూర్యాలను దారిమళ్లించారని విమర్శించారు. ఈ దారిమళ్లించిన అమూల్యపు కలశాల పాపంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి వాటా ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. మహా కుంభాభిషేకం పేరుతో ఆలయ ఈఓ, చైర్మన్ రూ.లక్షలు విరాళాల పేరుతో దోపిడీ చేశారని, వారు సేకరించిన డొనేషన్ల వివరాలను భక్తుల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


