నమో నారసింహా.. ప్రణమామి | - | Sakshi
Sakshi News home page

నమో నారసింహా.. ప్రణమామి

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

● హంస వాహనంపై నృసింహుడి వైభవం ● వైభవంగా క్షేత్రోత్సవం

సరస్వతీ దేవిగా దేవదేవుడు

రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామి వారు సరస్వతీదేవి అవతారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి క్రేన్‌ మండపంలో హంస వాహనాన్ని శోభాయమానంగా అలంకరించి స్వామివారిని కొలువుదీర్చారు. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య నృసింహుడు హంస వాహనంలో కోన మాడవీధుల్లో విహరించారు. పారువేట మండపం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పళ్లరసాలు, చందనం, పసుపు, నారికేళంతో అభిషేకించారు. అంతకుముందు టీటీడీ ఆగమ పండితులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో నరసింహ హోమాన్ని నిర్వహించారు. అలాగే అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు చేశారు. రాత్రి స్వామి, అమ్మవార్లను తిరుచ్చిలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు.

హనుమంతునిపై భక్తవరదుడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి బంగారు హనుమంత సేవను వైభవంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై కొలువుదీరి తిరు మాడవీధుల్లో ఊరేగు తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

నేడు గరుడ వాహనం

పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 10 గంటలకు బంగారు గరుడ వాహనం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 6 గంటలకు పూలంగి సేవ, 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ చేపడతామని పేర్కొన్నారు. గరుడ వాహనానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

పట్టువస్త్రాల సమర్పణ

ఉత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని లక్ష్మీనరసింహునికి మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో చంద్రశేఖర్‌ పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ ఏసీ జనార్ధన్‌రెడ్డి మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశ్వీరవచనం అందించారు. కార్యక్రమంలో ఫెస్టివల్‌ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, సోమయ్య, ఉప ప్రధాన అర్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు రాామానుజాచార్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement