డ్రోన్ కెమెరాలతో బట్టబయలైన బండారం
స్పెషల్ బ్రాంచి పోలీసుల దాడితో గేమ్ ఓవర్
పోలీసులకు అడ్డంగా దొరికిన నాని అనుచరులు
రూ.45 వేలు నగదు, 14 సెల్‌ఫోన్లు,
ఆటో, 4 బైకులు స్వాధీనం
స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని పోలీసులపై ఒత్తిడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ని ఎమ్మెల్యే నాని సొంత మండలమైన పాకాలలో పేకాట క్లబ్బులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. బుధవారం పేకాట ఆడుతున్న నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని రాత్రి వరకు పోలీసులపై ఎమ్మెల్యే నాని ఒత్తిడి చేశారని సమాచారం. దీంతో ఆయన అండతోనే అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలో పేకాట స్థావరాలను తిరుపతి ఎస్పీ కమాండ్ కంట్రోల్ నుంచి నడిచే డ్రోన్ కెమెరాలు గుర్తించడంతో స్పెషల్ బ్రాంచి పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు. పలువురు నిందితులను పట్టుకున్నారు. వారిలో ఎమ్మెల్యే నాని ప్రధాన అనుచరులైన ప్రదీప్‌రెడ్డి, రాజానంద, పాలచిన్న ఉండగా, మరో ముగ్గురు అనుచరులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారిని కూడా రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో రహస్యంగా సమాచారం సేకరించి, ప్లాన్ ప్రకారం మెరుపుదాడి చేయడంతో పేకాట సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో నగదు, పేకాట సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేకాట దందా చాలాకాలంగా నడుస్తున్నప్పటికీ, ఇంతవరకు అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
మొదలైన హైడ్రామా
పేకాట స్థావరంలో పట్టుబడిన వ్యక్తులను స్పెషల్ బ్రాంచి పోలీసులు స్థానిక పోలీసులకు అప్పగించగా ఇక్కడే అసలు హైడ్రామా మొదలైంది. పట్టుబడిన వారికి స్టేషన్ బెయిల్‌పై ఇచ్చి పంపాలని ఎమ్మెల్యే నాని పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు వారిని వదిలి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
నగదు, వాహనాలు స్వాధీనం
పాకాల మండలం చెన్నుగారిపల్లి పంచాయతీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు వారి నుంచి రూ.45 వేలు నగదు, 14 సెల్‌ఫోన్లు, ఒక ఆటో, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్పెషల్ బ్రాంచి పోలీసులు పాకాల పోలీసులకు అప్పగించారు. సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ తరుణ్ కేసు నమోదు చేశారు.


