శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో గదులను అద్దెకు తీసుకుని అనేక ఏళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్న పేదలను ఉన్న ఫళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడం ఎంతవరకు సబబని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల కడుపుకొట్టడం సరైంది కాదన్నారు. ఆయన బుధవారం వైఎస్సార్ విగ్రహం వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంప్లెక్స్‌లో వ్యాపారం చేసుకుంటున్న పేదలకు 33 శాతం పెంచి అద్దె గదులను రెన్యువల్ చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఓ టీడీపీ నాయకురాలు గదులు నిర్మించుకుని వ్యాపారం చేసుకునేవారని తెలిపారు. వారు తనను సంప్రదించి అందరూ పేదవారని ఆదుకోవాలని కోరారని పేర్కొన్నారు. తాము పార్టీలకు అతీతంగా రెండేళ్లు రెన్యువల్ చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. ఇక్కడున్నది వైఎస్సార్ సీపీ వారు కాదన్నారు. వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. 2024 ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే పేదలను కోటీశ్వరులు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రోడ్డు మీద పడేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి పేదలకు సేవ చేయాలని హితవుపలికారు. లేనిపక్షంలో బాధితులతో కలిసి నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
పేదల షాపులు జోలికి రావద్దు
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పాడంటూ మున్సిపాలిటీ అధికారులు 24 మంది పేదల షాపులకు తాళాలు వేయడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో అనేకమంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఎవరూ ఇలా పేదలపై రాజకీయం చేయలేదన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ గదుల్లో అద్దెకు ఉండేవారు టీడీపీ నాయకుడిని కలవాలని, లేనిపక్షంలో గదులు కేటాయించడం కుదరదని అధికారులు చెప్పడంపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పగడాల రాజు, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్, కంఠా ఉదయ్ కుమార్, వల్లం గోపి, టైలర్ శ్రీను, ఆరిఫ్, చెంత రాజేంద్ర, జీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


