వైఎస్సార్‌సీపీ నేతల సతీమణులపై అసభ్యకర రాతలు
తిరుపతి మంగళం : తమ పార్టీ నాయకుల సతీమణులపై ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, నూకతోట రాజేష్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డితో కలిసి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచ్చారిని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలిశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాత పూర్వక ఫిర్యాదు అందజేశారు. తమ పార్టీకి చెందిన నాయకుల సతీమణులపై మాట్లాడే అర్హత రాధాకృష్ణకు లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. తమ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెడితే వెంటనే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్న పోలీసులు, రాధాకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల మా నాయకుడు జగన్‌మోహర్‌రెడ్డి రాష్ట్ర రాజధానిని రూ.20 వేల కోట్లతో అద్భుతంగా తయారుచేయవచ్చని, రూ.30 లక్షల జనాభాతో అత్యంత సుందరంగా చేయవచ్చని మావిగనన్‌ను సూచించారన్నారు. దీనిపై ప్రజల్లో విపరీతమైన సానుకూల చర్చ మొదలైందని, కానీ దీన్ని భరించలేని ఏబీఎన్ రాధాకృష్ణ తమ పార్టీ నేతల సతీమణులపైన అత్యంత అభ్యంతరకరమైన రీతిలో, అమానుషమైన స్థాయిలో, అవమానకర పోకడలతో రాతలు రాశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున అలజడి, విమర్శలు ఎదురైతే.. తప్పును సరిదిద్దుకోకుండా, పశ్చాతాపం చెందకుండా మళ్లీ అదే వ్యాఖ్యలను సమర్థించుకుంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం రాధాకృష్ణ నీచతత్వానికి నిదర్శనమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే.. వందలాది మంది తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని, రాధాకృష్ణపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్‌కళ్యాన్‌లు పదే పదే చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి అఫిషియల్ సోషల్ మీడియాలోనే కూటమి నేతలు తమ పార్టీ నేతలపై విచ్చల విడిగా పోస్టులు పెడుతుంటే వారిపై చర్యలు ఏవీ చంద్రబాబు అని ప్రశ్నించారు. కూటమి రెడ్‌బుక్ పాలన ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. ఈ ఘటనపై గాయపడిన హృదయాలతో తమ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు.


