తిరుపతి సిటీ: జిల్లాలో ఏపీ పీజీఈసెట్–2026 మంగళవారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మడీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీఈసెట్‌కు తిరుపతిలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర వర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్ష రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 9 నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షకు 531మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని, గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి సమష్టిగా పోరాడుదాం
తిరుపతి అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పోరాటాలు చేద్దామని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం ఆయన తిరుపతిలోని ఏఐటీయూసీ మహాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గోపినాధ్ రెడ్డి, మహిళా ఏపీ జేఏసీ చైర్‌పర్సన్ సంధ్యరాణితోపాటు సభ్యులను సన్మానించారు. అనంతరం ఆయన టీటీడీ ఈఓ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను వారి కార్యాలయాలకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా టీటీడీలో 30 గదులు రెవెన్యూ ఉద్యోగుల స్టేట్ ప్రోటోకాల్ కోసం కేటాయించాలని కోరారు. అలాగే తిరుపతిలో రెవెన్యూ గెస్ట్‌హౌస్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, తిరుమలలో ఉన్న 6 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు సిద్దాల శివప్రసాద్, ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి, కలెక్టరేట్ ఉద్యోగుల ప్రెసిడెంట్ భాస్కర్ జిల్లా కోశాధికారి రూప్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.


