అగ్నిప్రమాదాలపై అప్రమత్తత ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాలపై అప్రమత్తత ఉండాలి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

సూళ్లూరుపేట: శ్రీహరికోట షార్‌లో అగ్నిప్రమాదాలపై అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని తమిళనాడు అగ్నిమాపక కమిషన్‌ శాశ్వత సభ్యులు కేపీ సత్యమూర్తి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హలులో సోమవారం షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేపీ సత్యమూర్తి మాట్లాడుతూ రాకెట్‌ ప్రయోగాలకు వాడే ఇంధనాలు, ఇతర వస్తువులన్నీ కెమికల్స్‌తో కూడినవి కావడంతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలున్నందున కొన్ని సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ పాటిస్తున్నారన్నారు. దీంతో ఇబ్బంది లేదని, మండు వేసవిలో మాత్రం అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ అగ్నిప్రమాదాలకు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కూడా ఆయన చెప్పారు. అటవీ ప్రాంతం అయినందున అగ్నిమాపక సిబ్బంది అనుక్షణం జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ ఆయనకు జ్ఞాపిక అందజేశారు. అగ్నిప్రమాపక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఉద్యోగులకు అగ్నిప్రమాదాలపై నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో అసోసియేట్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌, కంట్రోలర్‌ జీ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement