– గాయాలతో బయటపడిన పెద్ద కుమారుడు
దొరవారిసత్రం: చందనముడి గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన అంబూరు సుజాత(35) అనుమానాస్పద స్థితిలో శనివారం అర్ధరాత్రి మంటలు అంటుకుని కాలిపోయి మృతి చెందగా ఆదివారం వెలుగు చూసింది. ఈమె పెద్ద కుమారుడు సుధీర్(22) తల్లిని కాపాడే ప్రయత్నంలో చెతులు కాలి గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. చందనముడి ఎస్సీ కాలనీకి చెందిన బాలరాజు భార్య సుజాత ఎప్పటిలాగానే మంచంపై నిద్రిస్తున్న సమయంలో పరుపుకి మంటలకు అంటుకుని శరీరం అంతా కాలిపోయి తీవ్రంగా గాయపడింది. అక్కడే కింద పడుకుని నిద్రిస్తున్న ఆమె ఇద్దరు కుమారులు సుధీర్, విష్ణు ప్రమాదం గుర్తించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుధీర్ రెండు చేతులు కాలి గాయపడ్డాడు. ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దోమల కాయిల్స్ మంచం మీద పడి నిప్పంటుకుని మంటలు రేగి సుజాత కాలిపోయినట్లు కొందరు, షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు రేగి ఘటన చోటు చేసుకుందని మరికొందరు చెబుతున్నారు. ఆమె భర్త బాలరాజు దైవ దర్శనం కోసం తిరుపతి, శ్రీశైలం వెళ్లినట్లు తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించే చర్యలు చేపట్టారు.


